Hathras Stampede Tragedy: ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటన వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. కొన్ని వందల మందికి కన్నీటిని మిగిల్చింది. తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి 16 ఏళ్ల కుమార్తె, తల్లి, భార్యను కోల్పోయి ఒంటరి జీవిగా మిగిలిపోయాడు. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తాను సర్వం కోల్పోయానని వాపోతున్నాడు.
"నా భార్య, కుమార్తె, తల్లి సత్సంగ్‌కు వెళ్లినట్లు నాకు మొదట తెలియదు. నేను పనిమీద బయటకు వెళ్లాను. సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగిందని వేరే వాళ్లు నాకు చెప్పారు. అప్పుడు వెంటనే నేను ఘటనాస్థలికి వెళ్లాను. అక్కడ నా 16 ఏళ్ల కుమార్తె, తల్లి, భార్య విగతజీవులుగా పడి ఉన్నారు. నా తల్లి మృతదేహాన్ని ఇంకా గుర్తించలేకపోయాను" అని వినోద్ వాపోయారు.
భర్త వద్దని చెప్పినా వినని భార్య- ఆఖరికి మృత్యు ఒడికి
తన భార్యను భోలే బాబా సత్సంగ్‌కు వెళ్లకుండా ఆపాలని చాలా సార్లు ప్రయత్నించానని, కానీ ఆమె వినలేదని వాపోయాడు మెహతాబ్. పొరుగింటి మహిళలతో కలిసి సత్సంగ్‌కు వెళ్లిన తన భార్య గుడియా దేవీ మృతి చెందిందని విలపించాడు. తన కుమార్తె క్షేమంగానే ఉందని తెలిపాడు.
కోడలు మృతి- మనవడి కోసం పడిగాపులు
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మరణించిన తన కోడలు రూబీ మృతదేహం వద్ద రాజ్‌కుమారి దేవీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పేదలకు మాత్రమే జరుగుతాయని, ధనికులకు కాదని వాపోయారు. తన మనవడి ఆచూకీ కోసం రాజ్ కుమారి దేవీ ఆందోళన చెందుతున్నారు. తనతో పాటు 60 మంది బస్సులో హాథ్రస్‌కు వచ్చారని ఆమె తెలిపారు.
ఇంటికి వెళ్లే సమయంలో తొక్కిసలాట
మరోవైపు, సత్సంగ్‌ను ముగించుకుని మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు. అలాగే సత్సంగ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా ప్రజలు బయటికి రావడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగిందని మరో ప్రత్యక్ష సాక్షి ఊర్మిలా దేవి పేర్కొన్నారు.