Student Raped In Anna University : తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక అన్నా యూనివర్సిటీ కాంపస్‌లో దారుణం జరిగింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఇద్దరు దుండగులు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 'డిసెంబర్ 23 రాత్రి బాధితురాలు, ఆమె స్నేహితుడు కలిసి అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టి బయటకు తరిమేశారు. తరువాత వారిద్దరూ కలిసి ఆమెను దారుణంగా అత్యాచారం చేశారు. తరువాత ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన (నగ్న) ఫొటోలను తమ సెల్‌ఫోన్‌తో తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తరువాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.' అయినప్పటికీ ఆమె భయపడకుండా మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్వయంగా ఫిర్యాదు చేశారు.
ఓ నిందితుడు అరెస్ట్
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 64 ప్రకారం రేప్ కేస్ నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో ఓ నిందితుని ఇప్పటికే పట్టుకున్నారు. 37 ఏళ్ల వయస్సున్న ఆ నిందితుడు పేవ్‌మెంట్‌పై బిర్యానీ విక్రయిస్తుంటాడని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.