Election Security Deposit : ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మంది డిపాజిట్లు కోల్పోవడం చూస్తూనే ఉంటాం. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లను రాబట్టకపోతే డిపాజిట్‌ను కోల్పోతారు. ఇలా తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజా గణాంకాల్లో వెల్లడైంది. 2019లో కూడా 86 శాతం మందికి ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, వీటిని కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందున్నట్లు తెలుస్తోంది.
11వ లోక్‌సభలో రికార్డ్
దేశంలో ఇప్పటికి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 91,160 మంది అభ్యర్థులు పోటీపడగా వారిలో 78 శాతం (71,246) మంది డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. 1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 1874 మందికి గాను 745 మంది(40 శాతం) అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఆ తర్వాత డిపాజిట్లను కోల్పోవడం అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. 1991-92 ఎన్నికల్లో 86శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు. చరిత్రలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తలపడిన 1996 నాటి 11వ లోక్‌సభ ఎన్నికల్లో 91 శాతం మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2009లో 85 శాతం మందికి ఈ పరిస్థితి ఎదురైంది. 2014లో 8,251 మంది పోటీ చేస్తే 7వేల మంది అభ్యర్థులు అంటే 84శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు.
జాతీయ పార్టీల అభ్యర్థులే ఎక్కువ
అయితే, స్వతంత్ర, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల కన్నా జాతీయ పార్టీల నుంచి బరిలోకి దిగిన వారే తమ డిపాజిట్లను దక్కించుకుంటున్నారు. 1951లో 28శాతం మంది జాతీయ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1957లో కేవలం 14శాతం, 1977లో 9 శాతం మంది జాతీయ పార్టీ అభ్యర్థులకు ఈ పరిస్థితి ఎదురైంది. అయితే 2009లో మాత్రం ఈ పరిస్థితి పునరావృతం కాలేదు. జాతీయ పార్టీల తరఫున 1623 మంది పోటీ చేస్తే 779 మందికి (47శాతం) డిపాజిట్లు దక్కలేదు.