Eggs Offer Scam In Bengaluru :రూపాయికో గుడ్డు చొప్పున రూ.49కి 4 డజన్ల గుడ్లు అంటూ వచ్చిన ఆఫర్ లింక్‌పై క్లిక్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. అత్యాశతో అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసిన సదరు మహిళ బ్యాంక్ ఖాతాలో నుంచి ఏకంగా రూ.48వేలను స్వాహా చేశారు సైబర్ మోసగాళ్లు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
అసలేం జరిగిందంటే
బెంగళూరులోని వసంతనగర్‌కు చెందిన ఓ మహిళకు ఈనెల 17న ఓ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ నుంచి ఈ-మెయిల్ సందేశం వచ్చింది. అందులో కేవలం రూ.49కే 48 గుడ్లు (4 డజన్లు) అంటూ ఆఫర్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆశతో మెయిల్లో ఉన్న లింక్‌పై క్లిక్ చేసి గుడ్లను బుక్ చేయబోయింది. ఆర్డర్ డెలివరీ కోసం ఇంటి చిరునామా సహా వ్యక్తిగత నెంబర్‌ను కూడా అందులో నింపింది. ఇక ఆఫర్ పేమెంట్ రూ.49ని చెల్లించేందుకు తన క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేసింది. ధ్రువీకరణ కోసం ఆమె మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నెంబర్‌ను సంబంధిత బాక్స్‌లో నింపింది. దీంతో ఆమె అకౌంట్లో నుంచి రూ.49 కట్ అయ్యాయి. అయితే ఈ లావాదేవీ జరిగిన కొద్ది క్షణాలకే ఆమె ఫోన్‌కు రూ.48,199లు బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అయినట్లుగా మరో మెసేజ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి తన క్రెడిట్ కార్డును బ్లాక్ చేయాలని కోరింది. అనంతరం బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.