Dog Owners Make Common Mistakes:ఇటీవల కాలంలో ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే చాలా మంది వాటిలో ఎక్కువగా కుక్కలను పెంచుకుంటుటారు. ఇంట్లో ఓ మెంబర్‌గా వాటిని ట్రీట్ చేస్తున్నారు. నిజానికి పెట్స్‌ను పెంచుకోవడం వల్ల మనకు ఎప్పుడైనా మనసు బాగోలేకపోయినా, బోర్ కొట్టినా.. వాటితో కాసేపు ఆడితే మంచి రిలాక్సేషన్ లభిస్తోంది. అయితే చాలా మంది వాటి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. కుక్కే కదా అని ఎలా పడితే అలా పెంచుతూ కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇంతకీ, యజమానులు చేసే ఆ తప్పులేంటి.. వాటి వల్ల జరిగే నష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
తగిన సమయాన్ని కేటాయించకపోవడం : నేటి బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది పెట్స్ కోసం తగిన సమయం కేటాయించడం లేదు. కానీ, అలా కాకుండా మీరు వాటి కోసం కొంత సమయం కేటాయించమంటున్నారు నిపుణులు. అందుకోసం కాసేపు వాటిని బయటకు తీసుకెళ్లడం, వాటికి కొంత స్వేచ్ఛ ఇవ్వడం లాంటివి చేయాలంటున్నారు. అలా కాకుండా ఎప్పుడూ కట్టేసి ఉంచితే వాటి కండరాలలో ఎదుగుదల నశిస్తుంది. ఫలితంగా అవి ఎదగకపోవడం అటుంచితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు.
ఒంటరిగా వదిలివేయవద్దు : పని, ప్రయాణాల దృష్ట్యా చాలా మంది తాము పెంచుకుంటున్న పెట్స్‌ను ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి వెళుతుంటారు. కానీ, అన్ని సార్లు అలా వదిలేసి వెళ్లడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకుంటే అలా చేయడం వల్ల వాటి మానసిక ఎదుగదల తగ్గిపోతుంది. అలాగే యాక్టివ్‌గా ఉండకుండా స్తబ్దుగా ఉంటాయి. అందువల్ల వాటిని ఇంట్లో వదిలేసి వెళ్లే సమయంలో బొమ్మలు ఇవ్వడం లాంటివి చేయమంటున్నారు. వీలైతే డాగ్ కేర్ సెంటర్లో వదిలిపెట్టమంటున్నారు. ఇకపోతే కొన్ని డాగ్స్ మాత్రం ఒంటరిగా ఉండడానికి అనువైనవిగా ఉంటాయి. అందుకోసం వాటికి సౌకర్యవంతమైన, సురక్షితమైన స్థలం ఏర్పాటు చేయాలి. కావాల్సిన ఆహారం కూడా అందుబాటులో ఉంచాలి.
వ్యాయామం లేకపోవడం : కుక్కలు శారీరకంగా చురుకైన జంతువులు. కాబట్టి మనం శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ విధంగానైతే రోజూ వ్యాయామం చేస్తామో.. అలాగే వాటికి డైలీ తగిన వ్యాయామం చేయించడం అవసరం. అయితే ప్రతి కుక్క వ్యాయామ అవసరాలు భిన్నంగా ఉన్నప్పటికీ రోజూ కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటికి తగిన శారీరక శ్రమ లేకపోతే అవి బరువు పెరగడం, శారీరక సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.