DMK Election Manifesto : తమిళనాడులో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 75, రూ.65కు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అలాగే జాతీయ రహదారులపై ఉన్న టోల్గేట్లను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోతో పాటు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.
'ఆర్టికల్ 361 రద్దు చేస్తాం'
దేశంలో ప్రతి మహిళలకు నెలకు రూ.1000 ఇస్తామని మేనిఫెస్టోలో డీఎంకే పేర్కొంది. గవర్నర్ల నియామకానికి సంబంధించి రాష్ట్రాలను సంప్రదించి చర్చలు జరుపుతామని చెప్పింది. గవర్నర్లకు చట్టపరమైన మినహాయింపులు ఇచ్చే ఆర్టికల్ 361ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను తొలగించే అధికారాన్ని కేంద్రానికి కల్పించే ఆర్టికల్ 356 రద్దుపై పోరాడుతామని పేర్కొంది. రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. జాతీయ విద్యావిధానాన్ని నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టాలను తమిళనాడులో అమలు చేయమని మేనిఫెస్టోలో వెల్లడించింది.
లోకసభ అభ్యర్థుల జాబితా
మేనిఫెస్టోతో పాటు 21 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎంపీలైన కనిమొళి, టీఆర్ బాలు, ఎ రాజాలకు మరోసారి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. మిగిలిన 18సీట్లను మిత్రపక్షాలు అయిన కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే తదితర పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో బరిలోకి దిగనుంది. 21 మంది అభ్యర్థుల్లో 11 మంది కొత్తవారే ఉన్నారు.