Devendra Fadnavis Profile :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి జయభేరి మోగించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ మెుదలైంది. మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టే వారి జాబితాలో బీజేపీ నేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఫడణవీస్ ముచ్చటగా మూడోసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.
సీఎం కుర్చీ ఆయనదేనా?
దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని భాజపా నేత ప్రవీణ్ ధరేకర్ చెప్పారు. ఇప్పటికే కమలం పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యమంత్రి నియామకం కోసం ఆదివారం ముంబయికి కేంద్ర పరిశీలకులను పంపనున్నట్లు సమాచారం. సీఎం పదవిపై మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలైన శిందే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ కేంద్ర పరిశీలకులు చర్చలు జరపనున్నారు.
అయితే, కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు కలిసి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటాయని ఫడణవీస్ తెలిపారు.
"మహారాష్ట్ర ప్రజలు మాకు అపూర్వ విజయాన్ని అందించారు. ఇది మహారాష్ట్రలోని అన్ని వర్గాల ప్రజల ఐక్యతను చూపిస్తుంది. మా సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మేమంతా కలిసికట్టుగా పనిచేశాం. కాబట్టే దీనిని ఐక్యత విజయంగా భావిస్తున్నాను. ఇది మహాయుతి విజయంగా భావిస్తున్నాను. మా పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్ల సహకారంతో, ప్రతిపక్షాలు పన్నిన చక్రవ్యూహాన్ని నేను ఛేదించడంలో నేను విజయం సాధించాను. అయినప్పటికీ దీనిని నేను వ్యక్తిగత విజయంగా అనుకోను. నా పాత్ర చాలా చిన్నది. ఇది బీజేపీ సాధించిన విజయం. ఇక సీఎం పదవిపై కూడా ఎలాంటి వివాదాలు ఉండవు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మూడు పార్టీల నేతలు కలసి కూర్చొని దీనిపై నిర్ణయం తీసుకోవాలని తొలిరోజే సీఎం మీడియా సమావేశంలో చెప్పారు."
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
ఫడణవీస్ ప్రొఫైల్
మహారాష్ర్టలో 2014 లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో దేవేంద్ర ఫడణవీస్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఫడణవీస్‌కు పేరుంది. వాస్తవానికి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఫడణవీస్ రికార్డు సాధించారు.
- 1989లో ఆర్ఎస్ఎస్కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగంలో పనిచేశారు.
- 22 ఏళ్లకే నాగ్‌పుర్ కార్పొరేటర్ అయ్యారు.
- 1997లో 27 ఏళ్లకే నాగ్‌పుర్ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్న వయస్సులో మేయర్ అయిన వ్యక్తిగా నిలిచారు.
- 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫడణవీస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్ అసెంబ్లీ స్థానం పోటీ చేసి తొలి ప్రయత్నంలో విజయం సాధించారు.
- సౌమ్యుడు, మృదు స్వభావిగా పేరొందిన ఫడణవీస్‌పై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు.
- తన మొదటి పదవి కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం సహా పాటు సుపారిపాలన సాగించిన సీఎంగా ప్రజల్లో ఆదరణ పొందారు.
- ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కనుక మహాయుతి కూటమిలో బీజేపీ నేతకే సీఎం పదవిని ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.
72 గంటల్లోనే కొత్త ప్రభుత్వం!
నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. కనుక గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంటుంది. దీంతో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు సహా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు చేయడంపై నిమగ్నమైనట్లు తెలుస్తోంది.