Delhi HC stays Arvind Kejriwal Bail :మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్‌ను శుక్రవారం దిల్లీ హైకోర్టు నిలుపుదల చేసింది. రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది.
కాగా లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ (ED) విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. శుక్రవారం ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. "బెయిల్‌ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ బెంచ్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు" అని ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.
కేజ్రీవాల్ కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే?
- 2021 నవంబర్‌లో దిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టింది.
- 2022 జూలైలో ఈ మద్యం విదానం రూపకల్పన, అమలులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారు.
- 2022 ఆగస్టులో దిల్లీ మద్యం పాలసీలో అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులో నమోదు చేశాయి.
- 2022 సెప్టెంబర్‌లో దిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని రద్దు చేసింది.
- 2023 అక్టోబర్ 30న మనీలాండరింగ్ కేసులో నవంబర్ 2న హాజరు కావాలని కేజ్రీవాల్‌కు ఈడీ మొట్టమొదటి సారి సమన్లు జారీ చేసింది. అతర్వాత డిసెంబరు 21, జనవరి 3న విచారణ కావాలంటూ మరో రెండుసార్లు ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.
- 2024 జనవరి 18, ఫిబ్రవరి 2న తమ ముందు హాజరు కావాలని ఈడీ మరో రెండుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది
- 2024 ఫిబ్రవరి 3న సమన్లను దాటవేయడంపై మేజిస్టీరియల్ కోర్టులో కేజ్రీవాల్‌పై ఈడీ ఫిర్యాదు చేసింది.
- ఫిబ్రవరి 7న ఈడీ ఫిర్యాదుపై కేజ్రీవాల్‌కు మెజిస్టీరియల్ కోర్టు సమన్లు పంపింది.
- మార్చి 7న సమన్లు పాటించనందుకు కేజ్రీవాల్‌పై ED మళ్లీ మెజిస్ట్రియల్ కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు సమన్లు జారీ చేసింది.
- మార్చి 15న కేజ్రీవాల్‌పై విచారణకు స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది.
- మార్చి 16న సమన్ల దాటవేతపై మేజిస్టీరియల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
- మార్చి 21న అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు రక్షణ కల్పించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. అనంతరం కాసేపటికే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
- మార్చి 23న తనను ED అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
- ఏప్రిల్ 9న ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
- ఏప్రిల్ 10న దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేశారు.
- ఏప్రిల్ 15న కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 24లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
- ఏప్రిల్ 24న : కేజ్రీవాల్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
- మే 3న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
- మే 10న లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం జూన్ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
- మే 30న మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ దిల్లీ కోర్టును ఆశ్రయించారు.
- జూన్ 1: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును దిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
- జూన్ 5: వైద్య కారణాలతో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
- జూన్ 20న కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
- జూన్ 21న రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే విధించింది.
కల్తీసారా తాగి 47మంది మృతి- భగ్గుమన్న విపక్షాలు- అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు - tamil nadu hooch tragedy
మంచుకొండల్లో, యుద్ధనౌకలపై సైనికుల ఆసనాలు- కాశ్మీరంలో మోదీ- దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం - international yoga day