తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యత'- అప్పటివరకు కేంద్రానికి రైతుల డెడ్​లైన్ - centre porosals to farmers

Delhi Chalo Farmers Protest : కేంద్ర ప్రభుత్వానికి రైతులు డెడ్​లైన్ విధించారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే 'దిల్లీ చలో' కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం జరిగినా దానికి కేంద్రం బాధ్యత వహించాలని తేల్చిచెప్పారు.

Delhi Chalo Farmers Protest
Delhi Chalo Farmers Protest

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 5:41 PM IST

Delhi Chalo Farmers Protest : కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు, ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించారు. బుధవారం (ఫిబ్రవరి 21) ఉదయం 11గంటల లోగా, ప్రభుత్వం స్పందించకపోతే తాము తలపెట్టిన 'దిల్లీ చలో' కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తేల్చిచెప్పారు. గడువు ముగిసిన తర్వాత దిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

'ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యత'
బుధవారం తలపెట్టిన దిల్లీ చలో కార్యక్రమంపై రైతు నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడారు. 'మమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ దిల్లీలో అడుగుపెట్టనివ్వకూడదన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతులతో చర్చల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే దిల్లీ వైపు వెళ్లేందుకు అనుమతించాలి. మేము దిల్లీ వైపు వెళ్లినప్పుడు కాల్పులు జరిగాయి. ట్రాక్టర్ల టైర్లకు కూడా బుల్లెట్లు తగిలాయి. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇలాంటి వాటిని ప్రయోగించే వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తప్పుడు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం హరియాణా పరిస్థితి కశ్మీర్​లా తయారయ్యింది. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కు తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అని హెచ్చరించారు.

'ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి'
5 పంటలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని నిపుణులు అంటున్నారని పంధేర్​ తెలిపారు. దీని ద్వారా ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు ఆ కాంట్రాక్టు పరిధిలోకి రారని, అంతేకాకుండా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితి పెట్టడం సరికాదన్నారు. సరైన చట్టం లేకపోవడం వల్ల దోపిడీ జరుగుతోందన్న పంధేర్​​, ఎమ్​ఎస్​పీ చట్టం ద్వారా దీన్ని నియంత్రించవచ్చని తెలిపారు. కానీ కార్పొరెట్ శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.

'మోదీ బలమైన ప్రధాని అని మేమూ ఒప్పుకుంటాం!'
అంతేకాకుండా రైతుల అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు సర్వాన్ సింగ్ పంధేర్. తాజాగా చేసిన ప్రతిపాదనల వల్ల కేంద్రం అసలు రంగు బయటపడిందని అన్నారు. కనీస మద్దతు ధరపై చట్టం తెస్తే, ప్రభుత్వం దిగుమతులపై చేసే ఖర్చు కంటే తక్కువ ధరకే పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారని అన్నారు.'నరేంద్ర మోదీ బలమైన ప్రధాని అని బీజేపీ చెబుతోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, మోదీ బలమైన ప్రధాని అని రైతులు కూడా అంగీకరిస్తారు.' అని సర్వాన్ సింగ్ పంధేర్ వివరించారు.

రైతుల కోసం కేంద్రం ఆ పని చేయలేదా! : రాహుల్ గాంధీ
కనీస మద్దతు ధర-ఎమ్​ఎస్​పీకి చట్టపరమైన హామీని ఇవ్వగలిగితే అది రైతులను దేశ స్థూల జాతీయోత్పత్తి- జీడీపీ వృద్ధికి చోదకులుగా మారుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అంతేగానీ ఈ హామీని అమలు చేయడం వల్ల బడ్జెట్‌పై భారం పడదని చెప్పారు. ప్రభుత్వ బడ్జెట్‌లో ఎమ్​ఎస్​పీ హామీని అమలు చేయడం సాధ్యం కాదని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. క్రిసిల్(CRISIL) ప్రకారం 2022-23లో రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం వల్ల రూ.21 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అది మొత్తం బడ్జెట్‌లో 0.4 శాతం మాత్రమే అని రాహుల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. గతంలో 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మాఫీ, 1.8 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ పన్ను మినహాయింపు ఈ దేశంలో జరిగిందని గుర్తు చేశారు. రైతుల కోసం కొంచెం ఖర్చు చేయడానికి కేంద్రం ఎందుకు ఇబ్బంది పడుతోందని రాహుల్ ప్రశ్నించారు.

కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో- మరోసారి దిల్లీ చలోకు పిలుపు

5రోజులుగా సరిహద్దుల్లోనే రైతుల బస- పోలీసులపైకి రాళ్లు విసురుతూ దుండగుల విధ్వంసం- ఇంటర్నెట్​పై బ్యాన్​!

ABOUT THE AUTHOR

...view details