తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దర్శన్‌, పవిత్ర చుట్టూ బిగుస్తున్న ఉచ్చు- పోస్ట్​మార్టమ్​ రిపోర్ట్​లో కీలక విషయాలు వెలుగులోకి - Darshan Thoogudeepa Arrest - DARSHAN THOOGUDEEPA ARREST

Darshan Thoogudeepa Arrest : ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్‌ తూగదీపా అరెస్టుకు దారి తీసిన హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్‌ 30లక్షల ఇవ్వజూపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు వాడిన రాడ్లు, కర్రలు, తాడు సహా ఘటనాస్థలిలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదని నటి పవిత్ర గౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది.

Darshan Thoogudeepa Arrest
Darshan Thoogudeepa Arrest (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 4:04 PM IST

Darshan Thoogudeepa Arrest :గర్ల్‌ఫ్రెండ్‌ పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడని తన అభిమాని రేణుకస్వామిని హత్య చేసిన కేసులో ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్‌ తూగదీపా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ హత్య కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురికావడం, మృతదేహం బెంగళూరు కామాక్షి పాళ్యలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం మొబైల్ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు నటుడు దర్శన్‌, సినీ నటి పవిత్ర గౌడ సహా 16 మందిని అరెస్టు చేయడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి.

ఈ హత్యతో సంబంధం ఉన్న నిందితులకు దర్శన్‌ 30లక్షల రూపాయలు ఇవ్వజూపినట్లు, పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఇందులో కొంత డబ్బును ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. నిందితులు జైలు నుంచి విడుదలయ్యే వరకు వారి కుటుంబాలను చూసుకుంటానని దర్శన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో దర్శన్‌ సన్నిహితుడు నాగరాజు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. రేణుకస్వామిని తీసుకెళ్లిన డ్రైవర్‌ రవి పోలీసుల ముందు లొంగిపోయాడు. రవి కారులోనే నిందితులు హత్యకు గురైన రేణుకస్వామిని బెంగళూరుకు తీసుకువచ్చారు.

రేణుకస్వామి హత్యకు ఉపయోగించిన ఒక ఐరన్‌ రాడ్‌, తాడు, కర్రలు సహా ఘటనా స్థలిలో మద్యం బాటిళ్లు, సీసీటీవీ ఫుటేజీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకస్వామి బట్టలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపారు. నిందితుల కాల్‌ రికార్డులను, వాట్సాప్‌ చాట్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యకు ముందు రేణుక స్వామికి నిందితులు బలవంతంగా మద్యం తాగించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మొదట ఓ కారులో రేణుకాస్వామి మృతదేహాన్ని తీసుకెళుతుండగా దానిని వెంబడించిన మరో కారు దర్శన్‌దేనని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగిన ప్రాంతానికి కారులో వచ్చిన దర్శన్, తెల్లవారుజామున మూడుగంటలకు వెళ్లిపోయినట్లు CCTV ఫుటేజీ ద్వారా స్పష్టమైంది.

అందుకే చనిపోయాడు!
రేణుకాస్వామి పోస్టుమార్టమ్‌ నివేదికను పోలీసులు అందుకున్నారు. ఆ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. రేణుకస్వామి మర్మావయాలపై దర్శన్‌ తన్నడంతోనే అతను మరణించాడని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదికలోనూ రేణుకస్వామి మరణానికి ఇదే కారణమని ఉందని పోలీసులు గుర్తించారు. తల, పొట్ట, ఛాతీ భాగాలతో పాటు అతని ఒంటి మీద 15 చోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకస్వామి తలను ఓ మిని ట్రక్కుకు బాధినట్లు శవపరీక్షలో తెలుస్తోంది. ఇప్పటికే ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేను అలా చేయకుంటే బాగుండు : దర్శన్ గర్ల్​ఫ్రెండ్
మరోవైపు రేణుకస్వామి తనకు అశ్లీల చిత్రాలు పంపించిన విషయాన్ని తన ప్రియుడు దర్శన్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈ హత్య జరిగేది కాదని పవిత్రగౌడ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేసింది. తానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎదురయ్యేది కాదని విచారణ అధికారుల ముందు ఆమె రోదించింది. రేణుకస్వామి హత్య కేసుకు సంబంధించి బుధవారం నాటి విచారణలో ధీమాగా ఉన్న ఆమె గురువారం విచారణ సమయంలో ఎక్కువ ఆందోళనకు గురైందని గుర్తించారు.

దర్శన్​కు స్టేషన్​లో వీఐపీ సౌకర్యాలు!
మరోవైపు దర్శన్‌కు పోలీసు స్టేషన్‌లో వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారని వచ్చిన వార్తలను కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఖండించారు. ఇతర నిందితులలానే దర్శన్‌ను కూడా చూస్తున్నామని, బిర్యానీ పెట్టడంకానీ, లేదా ఇతర సదుపాయాలు కల్పించడంకానీ చేయలేదని అన్నారు.

రేణుక స్వామి హత్య కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. సామాజిక మాధ్యమాల్లోనూ దర్శన్‌, పవిత్రగౌడపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాళ్ల సినిమాలను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తన తండ్రి దర్శన్, తల్లి విజయలక్ష్మికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత అవసరం అని వారి కుమారుడు వినీశ్‌ తూగుదీప సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టాడు. తన తండ్రి దర్శన్‌ను అశ్లీల పదాలతో దూషిస్తున్న అందరికీ ధన్యవాదాలు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి హత్య చేసి ఉంటాడని తాను విశ్వసించడం లేదని, దర్యాప్తు పూర్తయిన అనంతరం నిజాలు బయటపడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details