తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు- ఇకపై ఆ నేరాలకు పాల్పడితే అంతే సంగతి! - New Criminal Laws In India 2024

New Criminal Laws In India 2024 : న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకువచ్చేలా రూపొందించిన కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అమల్లోకి వచ్చాయి.

New Criminal Laws In India 2024
New Criminal Laws In India 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 2:31 PM IST

Updated : Jul 1, 2024, 8:38 AM IST

New Criminal Laws In India 2024 :బ్రిటిష్​ వలస పాలన కాలంనాటి చట్టాలకు ముగింపు పలుకుతూ న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వటమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించారు. భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు. రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

'శిక్షల కంటే న్యాయం కోసమే'
కొత్త చట్టాలు పౌరులకు శిక్షలు విధించడం కంటే న్యాయం అందించడానికి ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వలసవాద నేర న్యాయ చట్టాల ముగింపును సూచిస్తూ, అందరికీ న్యాయం చేయాలన్న తలంపుతో కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. చట్టాలు కేవలం పేరు మార్పుకే పరిమితం కాదని, చట్టాల్లో పూర్తి సవరణలను తీసుకొచ్చామన్నారు. ఈ నూతన చట్టాలను పూర్తిగా భారతీయులే రూపొందించారని, దీని ఆత్మ, శరీరం పూర్తిగా భారతీయమేనని అన్నారు. ఈ కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని నిర్ధరిస్తాయని హోం మంత్రి తెలిపారు.

ఈ నిబంధనలు ప్రత్యేకం
ఈ కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తైన 45 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ నుంచి 60 రోజులలోపు అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి. పిల్లలను కొనడం, విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. భారతీయ శిక్షాస్మృతిలోని 511 సెక్షన్ల స్థానంలో ఇప్పుడు 358 సెక్షన్లు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 18 సెక్షన్లు ఇప్పటికే రద్దు చేశారు.

డిజీ లాకర్‌లో సాక్ష్యాలు భద్రం
సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన డిజీ లాకర్‌లో భద్రపరుస్తారు. క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపుతారు. దీనివల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీసు స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవచ్చు. కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితులు కేసు పురోగతిపై 90 రోజులలోపు అప్‌డేట్‌ పొందేందుకు అవకాశం కల్పించారు. క్రిమినల్‌ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

Last Updated : Jul 1, 2024, 8:38 AM IST

ABOUT THE AUTHOR

...view details