తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర, ఝార్ఖండ్​లో మిత్రపక్షాలకు కాంగ్రెస్ పెద్దపీట! తక్కువ సీట్లలోనే పోటీ- ఆ ఎఫెక్ట్​ వల్లేనా?

హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఎఫెక్ట్- మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై తగ్గిన కాంగ్రెస్- మహారాష్ట్ర, ఝార్ఖండ్​లో గతంలో కంటే తక్కువ సీట్లలో పోటీ

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Maharashtra Jharkhand Polls Congress
Maharashtra Jharkhand Polls Congress (Getty Images)

Maharashtra Jharkhand Polls Congress :ఇటీవలే జరిగిన హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు తక్కువ సీట్లలో పోటీకి సిద్ధమవుతోంది. అలాగే బీజేపీని ఢీకొట్టే వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

తక్కువ సీట్లలో పోటీ
మహారాష్ట్రలో ఉన్న 288 సీట్లలో గతంలో హస్తం పార్టీ 125 సీట్లు ఆశించింది. అయితే హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో కాంగ్రెస్ 105-110 సీట్లలో పోటీకి సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిత్రపక్షాలైన శివసేన(యూబీటీ), ఎన్​సీపీ(ఎస్​పీ), సమాజ్ వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నాయి. మిత్రపక్షాలకు సానుకూల సంకేతం పంపేందుకు తమ సీట్లను తగ్గించుకున్నామని వెల్లడించాయి.

2019లో కన్నా తక్కువే
2019లో జరిగిన ఝార్ఖండ్​లో అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమితో కలిసి కాంగ్రెస్ బరిలోకి దిగింది. అప్పట్లో కాంగ్రెస్ 31 సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దింపింది. అయితే ఇటీవల కాలంలో తమకు 33 సీట్లను ఇవ్వాలని కోరింది. అయితే తాజాగా మనసు మార్చుకుని, 29 సీట్లకే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఎక్కువ సీట్లు ఆశిస్తున్న జేఎంఎం
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాల్లో బరిలోకి దిగగా, తాజాగా మరో రెండు స్థానాలను అదనంగా ఆశిస్తోంది. వాటిని బీజేపీ, ఏజేఎస్​యూ నుంచి జేఎంఎంలో చేరిన కేదార్ హజ్రా, చందన్ కియారీలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆర్​జేడీ 2019లో 7 స్థానాల్లో పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో 5 సీట్లలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే సీపీఎం(ఎంఎల్) 4 సీట్లు దక్కనున్నాయి.

సోరేన్​తో రాహుల్ చర్చలు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం ఝార్ఖండ్​లో పర్యటించారు. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుపై జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తో చర్చలు జరిపారని తెలుస్తోంది. అలాగే ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఐ(ఎంఎల్‌) నేతలు అరూప్‌ ఛటర్జీ, బబ్లూ మహతోతో పొత్తుపై హేమంత్ సోరెన్‌ చర్చించినట్లు కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు తెలిపారు.

'గిరిజనుల మనోభావాలను బీజేపీ దెబ్బతీసింది'
సీట్ల పంపకం జరగకముందే, సంకీర్ణ ప్రభుత్వ విజయాన్ని ఓటర్లకు వివరించేందుకు కూటమి రంగంలోకి దిగిందని ఏఐసీసీ, ఝార్ఖండ్ ఎన్నికల ఇన్​ఛార్జ్ సప్తగిరి ఉలక ఈటీవీ భారత్​తో చెప్పారు. గత కొన్నాళ్లుగా జేఎంఎం- కాంగ్రెస్ కూటమి పేదలకు అండగా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుందని, వాటిని ప్రచారం చేస్తున్నామని తెలిపారు. అధికార కూటమిని అస్థిరపరచడం ద్వారా గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని పేర్కొన్నారు.

ఉద్ధవ్​తో చర్చలు
మరోవైపు, మహారాష్ట్రలోనూ మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ తగ్గినట్లు తెలుస్తోంది. శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ రమేశ్ చెన్నితాల ముంబయిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉందని, అక్కడ తమకు ఎక్కువ సీట్లను కేటాయించాలని కోరారు. మహారాష్ట్రలో మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లో కూటమి పార్టీలు పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తామని, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడిగా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అప్పుడే!
'అక్టోబర్ 20న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అప్పుడు 60మంది అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ రిలీజ్ ప్రకటించొచ్చు. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని భావిస్తున్నాం. ఇండియా కూటమి పార్టీలన్ని మహారాష్ట్రలో బీజేపీని ఓడిస్తాయి' అని కాంగ్రెస్ నేత బీఎమ్ సందీప్ ఈటీవీ భారత్​కు తెలిపారు

ABOUT THE AUTHOR

...view details