Common Man Contesting On PM Modi :బతికిఉన్న తనను చనిపోయావంటూ రికార్డుల్లోకి ఎక్కించిన అధికారుల తీరుకు విసుగు చెంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్లు న్యాయపోరాటం చేసి గెలిచారు ఆ వ్యక్తి. ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల బరిలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పోటీకి సిద్ధమయ్యారు (Lok Sabha Elections 2024). ఆయనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాకు చెందిన సామాన్య వ్యక్తి లాల్ బిహారీ.
18ఏళ్ల న్యాయపోరాటం
Living Person Shown Dead In Govt Records Of UP :లాల్ బిహారీ మరణించారంటూ కొన్నేళ్ల క్రితం సంబంధిత పరిపాలనా యంత్రాంగం ఆయన పేరును అధికారిక రికార్డుల్లో చేర్చింది. దీంతో ఆందోళన చెందిన ఆయన ఇంకా సజీవంగా ఉన్న తన పేరును అధికారిక లెక్కల్లో నుంచి తొలగించాలని చాలాసార్లు అధికారులను ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకపోవడం వల్ల హైకోర్టు గడపతొక్కారు. ఇక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అలా ఏకంగా 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు లాల్.
లాల్ బిహారీ పాలిటిక్స్
1988 లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ స్థానం నుంచి దివంగత మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై పోటీ చేశారు లాల్ బిహారీ. ఆ తర్వాత అమేఠీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. ఇలా పలు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఈసారి దేశ ప్రధానిపైనే పోటీకి సై అంటున్నారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయనున్నట్లు తెలిపారు లాల్ బిహారి.
ఎన్నికల్లో ఓటమి- కానీ అక్కడ విజయం
అజంగఢ్ జిల్లాకు చెందిన లాల్ బిహారీ 1976లో చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో చూపించారు అధికారులు. దీనిని తొలగించేందుకు ఆయన కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం దొరకలేదు. దీంతో అతను జీవించి ఉన్నానని నిరూపించుకునేందుకు పెద్ద పెద్ద నాయకులపై ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 1980లో 'లాల్ బిహారీ మృత సంఘ్' అనే దానిని స్థాపించారు.
అలా ఈ సంఘం తరఫున 1988లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ స్థానం నుంచి వీపీ సింగ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కాగా, ఈ స్థానంలో అప్పటికే ఎంపీగా కొనసాగుతున్న బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అనంతరం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై అమేఠీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినాసరే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం మానలేదు లాల్ బిహారీ.
2004లో అజంగఢ్‌లోని లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. 1991, 2002, 2007 సంవత్సరాల్లోనూ ఇదే జిల్లాలోని ముబారక్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చెరో మూడుసార్లు పోటీ చేశానని తెలిపారు లాల్ బిహారీ.