తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులతో చర్చలకు కేంద్రం రెడీ - ట్రీట్​మెంట్​కు జగ్జీత్‌ సింగ్‌ అంగీకారం - CENTRE MEETING WITH FARMERS

నిరసన చేస్తున్న రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం- ఫిబ్రవరి 14న చర్చలకు రావాలని ప్రతిపాదన - వైద్యానికి అంగీకరించిన రైతు నేత జగ్జీత్ సింగ్

Centre Meeting With Farmers
Centre Meeting With Farmers (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 6:57 AM IST

Centre Meeting With Farmers : పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని ఖనౌరీ, శంభు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతు నేతలు ఫిబ్రవరి 14న చండీగఢ్‌ వేదికగా చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కేంద్రంతో చర్చల్లో చురుగ్గా పాల్గొనేందుకు వైద్యసాయం పొందాలని జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను మిగతా రైతునేతలు కోరారు. 54 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ తీవ్రంగా నీరసించిపోయిన డల్లేవాల్‌ వైద్యసాయం పొందేందుకు అంగీకరించారు. అయితే పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లీగల్ గ్యారెంటీ వచ్చేవరకు జగ్జీత్​ సింగ్ ఆమరణ నిరాహార దీక్ష ముగించరని మరో రైతు నేత సుఖ్​జీత్ సింగ్ హర్డోజ్​హండే పేర్కొన్నారు.

అంతకుముందు జాయింట్‌ సెక్రటరీ హోదాలోని అధికారి ప్రియా రంజన్‌ సారథ్యంలో కేంద్ర ప్రతినిధుల బృందం ఖనౌరీ వద్ద దల్లేవాల్‌తో పాటు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాల ప్రతినిధులతో సమావేశమైంది. అనంతరం రైతు నేతలు దల్లేవాల్​ను ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రతినిధులు బృందం కూడా చికిత్స తీసుకోవాలని, అప్పుడే ఫ్రిబ్రవరిలో జరిగే సమావేశానికి హాజరు కాగలరని చెప్పింది. ఈ మేరకు తాము జగ్జీత్​ సింగ్ దల్లేవాల్​ ఆరోగ్యం గురించి వాకబు చేశామని, అనంతరం నిరసన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యామని ప్రియా రంజన్ తెలిపారు.

ఇదిలా ఉండగా, కేంద్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు అందాయని, వాటిపై తాము చర్చించాల్సి ఉందని రైతు నేతలు తెలిపారు. మరోవైపు శనివారం జరిగిన మూడు రైతు సంఘాల సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

ABOUT THE AUTHOR

...view details