Wayanad Landslide 2024 :కేరళ వయనాడ్లో జరిగిన కొండచరియలు విరిగిపడిన ప్రమాదంపై బుధవారం పార్లమెంట్ వేదికగా స్పందించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు. ఈ ముప్పు గురించి జులై 23నే అప్రమత్తం చేశామని కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదని ఆరోపించారు. భారీ వర్షాలు కురవగానే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆ రాష్ట్రానికి పంపించామని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు.
"ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నింటిపైనా ఓ స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నా. 2014 తర్వాత హెచ్చరిక వ్యవస్థపై ప్రభుత్వం సుమారు రూ.2వేల కోట్లను ఖర్చు చేసింది. ఈ వ్యవస్థను 2016, 2023లో ఆధునీకరించాం. ప్రపంచంలోనే ఆధునిక హెచ్చరిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. వారం రోజుల ముందే ప్రమాదాన్ని గుర్తించే 4 దేశాల్లో భారత్ ఒకటి. కేంద్ర ప్రభుత్వం జులై 23న కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రమాదం జరగడానికి సుమారు వారం రోజుల ముందే ఇచ్చాం. ఆ తర్వాత జులై 24, 25 తేదీల్లో మరోసారి ఇచ్చాం. జులై 26న 20 సెంటీమీటర్ల భారీ వర్షం కురవనుందని, ఫలితంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించాం. భారీగా బురదప్రవాహం వస్తుందని, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని చెప్పాం. అందుకోసమే జులై 23నే సుమారు 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు తరలించాం. కానీ కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందా? ఒకవేళ తరలిస్తే ఇంతమంది ప్రజలు ఎలా మరణించారు?"
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి