తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మకు టికెట్​- కుమారుడికి నో- పార్టీలో చేరిన గంటల్లోనే సీటు- సందేశ్​ఖాలీ బాధితురాలికి చోటు - BJP Lok Sabha Candidates List

BJP Lok Sabha Candidates List : లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. ఇందులో సొంత పార్టీపై విమర్శలు చేసిన, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులకు బీజేపీ లోక్​సభ ఎన్నికలల్లో స్థానం కల్పించలేదు.

BJP Lok Sabha Candidates List
BJP Lok Sabha Candidates List

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:39 AM IST

BJP Lok Sabha Candidates List : సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. కొందరు కేంద్ర మంత్రులకు టికెట్​ ఇవ్వగా, మరికొందరిని పక్కనబెట్టారు. సినీ, వ్యాపార రంగాలకు చెందినవారికి స్థానం కల్పించారు. కొందరికి పార్టీలో చేరిన గంటలోపే టికెట్లు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి టికెట్​ ఇచ్చేందుకు నిరాకరించింది కమలం పార్టీ అధిష్ఠానం. కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్​ గాంధీకి లోక్​సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో స్థానం లభించలేదు. కానీ, ఆయన తల్లి మేనకా గాంధీకి మాత్రం అవకాశం కల్పించింది బీజేపీ. ఈ జాబితాలో సినీ నటి కంగనా రనౌత్, అరుణ్​ గోవిల్​, జితిన్ ప్రసాద్, జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ పేర్లు ఉన్నాయి. కానీ​ కేంద్ర సహాయ మంత్రులు అశ్వినీకుమార్ చౌబే, వీకే సింగ్​కు జాబితాలో స్థానం లభించలేదు. 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసింది.

అమ్మకు టికెట్​- కుమారుడికి నో
2019 ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్​ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు వరుణ్​ గాంధీ. అయితే గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుందని, వ్యవసాయ చట్టాలు, ఆరోగ్యం ఇలా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే లోక్​సభ ఎన్నికల జాబితాలో పీలీభిత్ స్థానం నుంచి వరుణ్​గాంధీని తప్పించి జితిన్​ ప్రసాద్​కు అవకాశం కల్పించారు. అదే కాకుండా వరుణ్​ తల్లి మేనకాగాంధీని సుల్తాన్​పుర్​ నుంచి పోటీకి నిలిపింది. ఈసారి బీజేపీ 400కుపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అనంతకుమార్‌ హెగ్డే మూల్యం చెల్లించుకున్నారు. ఉత్తర కన్నడ స్థానంలో ఆయన్ని తప్పించి విశ్వేశ్వర్‌ హెగ్డేను రంగంలోకి దింపింది.

కొత్తవారికి అవకాశం
ఇక రామాయణ్‌ టీవీ ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ స్థానం నుంచి రంగంలోకి దింపింది. ఆదివారమే పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ను హరియాణాలోని కురుక్షేత్ర స్థానం నుంచి పోటీకి నిలిపింది. హిమాచల్‌లో మండీ స్థానం నుంచి సినీనటి కంగనా రనౌత్‌ను బరిలోకి దింపింది. కర్ణాటకలోని బెలగావి నుంచి దివంగత కేంద్రమంత్రి సురేష్‌ అంగడి కుటుంబ సభ్యులను తప్పించి ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ను నిలబెట్టారు. ఆ రాష్ట్రం నుంచి ప్రకటించిన 4 స్థానాల్లో మూడుచోట్ల కొత్తవారికే అవకాశమిచ్చారు.

సందేశ్​ఖాలీ స్థానంలో మహిళ
మరోవైపు సందేశ్‌ఖాలీలో షాజహాన్‌ షేక్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళ రేఖ పత్రా అనే గృహిణికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బసిర్‌హట్‌ నుంచి పోటీ చేయనున్నారు. అక్కడ మహిళలకు మద్దతుగా ఉండటం కోసమే రేఖ పేరును ప్రకటించారు. కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీపై పోటీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ను రంగంలోకి దింపారు. మహారాష్ట్ర నుంచి ప్రకటించిన మూడు స్థానాల్లో ఒకచోట సిట్టింగ్‌ను మార్చారు. మహారాష్ట్ర నుంచి ప్రకటించిన మూడు స్థానాల్లో ఒకచోట సిట్టింగ్‌ను మార్చారు. ఒడిశాలో ప్రకటించిన 18 స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్‌లను తప్పించారు. వీరిలో కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ ఒకరు. బంగాల్​లో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిచింది.

మోదీపై పోటీ చేసేది మాజీ బీజేపీ నేతే- ముచ్చటగా మూడోసారి ఢీ- ఎవరీ అజయ్​ రాయ్​? - Modi Vs Ajay Rai Varanasi Lok Sabha

ఆరు భాషల్లో అశ్విని రాజకీయం- బీజేపీ ఎంపీ అభ్యర్థిగా స్కూల్​ టీచర్ - BJP Multi Lingual Candidate

ABOUT THE AUTHOR

...view details