తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ యాత్రలో ఉద్రిక్తత- గువాహటిలోకి రాకుండా బారికేడ్లు- దూసుకెళ్లిన కార్యకర్తలు

Bharat Jodo Nyay Yatra Stopped : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను గువాహటిలోకి అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. అడ్డుగా పెట్టిన బారికేడ్లను ఛేదించుకొని మరీ కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ.

bharat-jodo-nyay-yatra-stopped
bharat-jodo-nyay-yatra-stopped

By PTI

Published : Jan 23, 2024, 1:00 PM IST

Updated : Jan 23, 2024, 5:30 PM IST

Bharat Jodo Nyay Yatra Stopped :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు అసోంలో అడ్డంకులు ఎదురయ్యాయి. గువాహటి నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. బారికేడ్లు మాత్రమే ఛేదించుకొని వెళ్లామని, చట్టాన్ని అతిక్రమించబోమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గువాహటిలోకి యాత్రను అనుమతించలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇదివరకు పేర్కొన్నారు. అయితే, రాహుల్​కు స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో కార్యకర్తలు ఖానాపారాలోని గువాహటి చౌక్​ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేస్తూ రాహుల్​కు స్వాగతం పలికారు. 'పోలీసుల బారికేడ్లు తొలగించుకొని వచ్చాం. మేం గెలిచాం' అని అసోం ఏఐసీసీ ఇంఛార్జ్ జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు.

'నన్ను అడ్డుకోవాలని అమిత్ షా ఫోన్ చేశారు'
యాత్ర గువాహటిలోకి ప్రవేశించకముందు అసోం-మేఘాలయ సరిహద్దులో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్రం, అసోం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలోని విద్యార్థులను బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎవరూ భయపడవద్దని అన్నారు. మేఘాలయలో విద్యార్థులను కలవకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించారు. అసోం సీఎంకు అమిత్ షా ఫోన్ చేసి తనను అడ్డుకోవాలని ఆదేశించారని అన్నారు.

"మమ్మల్ని ప్రతిచోట అడ్డుకుంటున్నారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడకూడదని అసోం ముఖ్యమంత్రికి ఈ దేశ హోంమంత్రి ఫోన్ చేశారు. యూనివర్సిటీ అధికారులకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం అనేది ముఖ్యం కాదు. విద్యార్థులు తమకు నచ్చిన వ్యక్తి ప్రసంగాన్ని వినడం ముఖ్యం. అసోంలోని ఏ విద్యాసంస్థలోనూ విద్యార్థులకు ఈ స్వేచ్ఛ లేదు. మీ భాష మాట్లాడకూడదు, మీరు సొంత చరిత్ర కలిగి ఉండకూడదని వారు అంటున్నారు.

తమను తాము బలహీనులని ఎవరూ అనుకోవద్దు. మిమ్మల్ని ఆలోచించనీయకుండా ఎవరూ అడ్డుకోలేరు. మీకు నచ్చిన భాషలో చదువుకోకుండా ఎవరూ ఆపలేరు. మీకు నచ్చిన మతాన్ని విశ్వసించకుండా నిలువరించలేరు. యూనివర్సిటీలో జరగాల్సిన నా కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. కానీ మీరు (విద్యార్థులు) యూనివర్సిటీ బయట నా ప్రసంగం వినేందుకు వచ్చారు. విద్యార్థుల ఆలోచనలకు కళ్లెం వేస్తే భారత్ మనుగడ సాధించలేదు. విద్యార్థులు ఎవరికీ భయపడకూడదు. మీరే ఈ దేశానికి భవిష్యత్తు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

'మీ అడ్డంకులు మంచే చేశాయి'
గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ హిమంతపై తీవ్రంగా విరుచుకుపడ్డారు రాహుల్. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం ఆయనేనని ఆరోపించారు. యాత్రను అడ్డుకునేందుకు హిమంత, అమిత్ షా చేసిన పనులు తమకు అనుకూల ఫలితాలే ఇచ్చాయన్నారు. ఇండియా కూటమి పక్షాలు సైతం యాత్రలో భాగమైతే బాగుంటుందని అన్నారు. ఆలయాల్లోకి, విశ్వవిద్యాలయాల్లోకి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని బెదిరింపు చర్యలుగా పేర్కొన్న రాహుల్- వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ బీజేపీ రాజకీయ కార్యక్రమం అని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు.

"యాత్రకు వ్యతిరేకంగా అసోం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పని భారత్ జోడో న్యాయ్ యాత్రకు మంచే చేసింది. మాకు ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. మమ్మల్ని అడ్డుకోవడం ద్వారా అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి మాకు సహాయం చేశారు. అసోంలో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం మా యాత్రే. వారు బెదిరింపులకు పాల్పడటం వల్లే మా సందేశం ప్రజలకు చేరుతోంది."
-ప్రెస్ కాన్ఫరెన్స్​లో రాహుల్ గాంధీ

రాహుల్​పై కేసు పెట్టాలని సీఎం ఆదేశం
ఇదిలా ఉండగా, పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు సీఎం హిమంత. అసోం శాంతియుత రాష్ట్రమని, కాంగ్రెస్ తరహా నక్సలైట్ ఎత్తులు తమ సంస్కృతికి కొత్త అని వ్యాఖ్యానించారు. తన మద్దతుదారులను రెచ్చగొట్టేందుకు రాహుల్ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​ పోస్ట్​లో తెలిపారు.

కాగా, సోమవారం రాహుల్ గాంధీని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి అనుమతి ఉంటుందని చెప్పారు. ఆయన్ను ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి.

అసోంలో రాహుల్‌ గాంధీ యాత్రకు అడ్డంకులు - ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ కాంగ్రెస్ ఫైర్

Last Updated : Jan 23, 2024, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details