Bengaluru Building Collapse Death Toll: కర్ణాటకలోని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కాగా శిథిలాల కింద చిక్కుకున్న 13 మంది కార్మికులను సహాయ సిబ్బంది రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలో రాజకీయ దుమారు లేపింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త జస్టిస్ బీఎస్ పాటిల్ ఘటనా స్థలాన్ని సందర్శించి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బిల్డింగ్ కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి- ప్రమాదంపై రాజకీయ దుమారం
బెంగళూరులో కుప్పకూలిన నిర్మాణ దశలో ఉన్న భవనం - ఎనిమిది మంది మృతి - 13 మంది సేఫ్!
Published : Oct 23, 2024, 10:57 AM IST
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామువరకు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వానల ధాటికి బాబూసాపాళ్య ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఆరు అంతస్తుల భవనం మంగళవారం సాయంత్రం కూలిపోయింది. ప్రమాద సమయంలో 20 మందికి పైగా కార్మికులు అందులో ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఒక కార్మికుడు మరణించగా, అతని మృతదేహాన్ని సహాయ బృందాలు వెలికి తీశాయి. బుధవారం ఉదయానికి మరో ఏడు మృతదేహాలను వెలికి తీసినట్లు తూర్పు బెంగళూరు డీసీపీ దేవరాజ తెలిపారు. ఇప్పటివరకు 13 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు.
'ఇది ప్రమాదం కాదు హత్య'
'బెంగళూరులో అక్రమంగా భవనం నిర్మాణ జరగుతోందనే విషయం అవినీతి కర్ణాటక ప్రభుత్వానికి తెలియకపోవడం దురదృష్టకరం' అని బీజేపీ మండిపడింది. కర్ణాటకు అవినీతి అనే చెడ్డ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. 'కేవలం పేదల భూములను దోచుకోవడం పైనే సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే దృష్టి సారించడం మన దురదృష్టకరం. కర్ణాటకలో ఇప్పుడు చూస్తున్నంత దుష్పరిపాలన ఎప్పుడూ చూడలేదు. దీని వల్ల సామాన్యులు, అమాయకులే ప్రాణాలును కోల్పోతున్నారు. ఇది కేవలం ప్రమాదం కాదు. హత్యతో సమానం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల పట్ల నిజంగా అవగాహన ఉంటే నగరం నడిబొడ్డున అనధికార నిర్మాణం ఎలా సాధ్యమైంది' అని ప్రదీప్ ప్రశ్నించారు.