Badlapur Case Accused Death CID Investigation :మహారాష్ట్ర బద్లాపుర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి మృతిపై అనుమానాలు నెలకొన్న వేళ నేర పరిశోధన విభాగం-CID రంగంలోకి దిగింది. ఈ కేసును మహారాష్ట్ర CID బృందం దర్యాప్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బద్లాపుర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్ శిందే సోమవారం పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి పోలీస్ వాహనంలో బద్లాపుర్ తరలిస్తుండగా- ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలో పోలీసు అధికారి తుపాకీని లాక్కున్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు అధికారి నిందితుడిపై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో అక్షయ్‌తోపాటు పోలీసులు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం ఠాణె నుంచి ముంబయిలోని JJ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష దృశ్యాలను చిత్రీకరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ, ఈ కేసులో మహారాష్ట్ర CID బృందం విచారణ ప్రారంభించింది. నిందితుడు అక్షయ్ మృతికి సంబంధించి పోలీసుల వాహనాన్ని ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల బృందం పరిశీలించింది. ముంబ్రా బైపాస్ ప్రాంతం వద్ద ఘటనా స్థలాన్ని సీఐడీ బృందం పరిశీలించనుంది. ఆ సమయంలో వాహనంలో ఉన్న పోలీస్ సిబ్బంది వాంగ్మూలాలను తీసుకోనున్నారు. అలాగే నిందితుడి తల్లిదండ్రులు వాంగ్మూలాన్ని సీఐడీ బృందం నమోదు చేయనుంది.
'టపాసులకే భయపడతాడు- తుపాకీ ఎలా కాల్చాడు?'
తమ కుమారుడి మృతిపై నిందితుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అక్షయ్ మృతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడి హత్య వెనుకు పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తమ కుమారుడు అక్షయ్ ఒంటరిగా రోడ్డు దాటడానికి కూడా భయపడతాడని నిందితుడి తల్లి అల్కా శిందే చెప్పారు. అక్షయ్ టపాసులు పేల్చడానికే భయపడతాడని, అలాంటిది పోలీసులు నుంచి తుపాకీని ఎలా లాక్కున్నాడని ప్రశ్నించారు.