Ayodhya Ram Temple Construction Stone: శ్రీరామచంద్రుడి విగ్రహం రూపొందించడాని ఉపయోగించిన శిలను, రామ మందిర నిర్మాణంలో వాడిన రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేశారు కర్ణాటకు చెందిన శాస్త్రవేత్తలు. ఆలయ నిర్మాణం కోసం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, సాదరహళ్లి, దేవనహళ్లిలో లభించిన రాళ్లను ఉపయోగించారు. పునాది నిర్మాణం కోసం తెలంగాణలోని వరంగల్, కరీంనగర్‌లోని క్వారీల్లో లభ్యమైన రాళ్లను వినియోగించారు. ఫ్లోరింగ్ కోసం రాజస్థాన్‌కు చెందిన మక్రానా మార్బుల్స్, బాల రాముడి విగ్రహం కోసం మైసూర్‌లోని హెగ్గదేవన్కోట్లోని కృష్ణశిలను ఉపయోగించారు.
"రామలల్లా విగ్రహాం కోసం చాలా రాళ్లను పరిశీలించాం. చివరకు మూడు రాళ్లను ఎంపిక చేశాం. అందులో రెండు మైసూర్‌కు చెందినవి. ఇంకొకటి మక్రానా మార్బుల్. గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం మైసూర్ కృష్ణశిలతో రూపొందింది." - రాజన్ బాబు, ఎన్ఐఆర్ఎం సీనియర్ శాస్త్రవేత్త
ఆలయానికి ఎలాంటి నాణ్యత ఉన్న రాయిని ఉపయోగించాలి, ఎలా నిర్మించాలి అనే విషయాలపై కోలార్‌లోని కేజీఎఫ్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వెళ్లి రాళ్ల నాణ్యతను పరీక్షించారు. 'రామమందిరం నిర్మాణం దేశం గర్వించదగ్గ విషయం. రామాలయ నిర్మాణం కోసం రాయిని ఎంపిక చేయడం పెద్ద సవాల్. కృత్రిమ మెటీరియల్‌తో కాకుండా సహజంగా లభించిన రాళ్లను అలానే తీసుకొచ్చి నిర్మించటం మాకు పెద్ద ఛాలెంజ్.' అని ఎన్ఐఆర్ఎం సీనియర్ శాస్త్రవేత్త రాజన్ బాబు తెలిపారు.