Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడిన వేళ సీతాదేవి స్వస్థలం నేపాల్‌లోని జనక్‌పుర్ ధామ్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. జనక్‌పుర్‌లోని మాతా సీతాదేవి ఆలయం రంగు రంగుల విద్యుత్ కాంతుల్లో మెరుస్తోంది. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భక్తులు జనక్‌పుర్ ధామ్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నాపెద్దా అంతా దీక్షల్లో పాల్గొంటున్నారు. గుడిలో నిర్వహించిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. జనక్‌పుర్ జానకీ దేవి ఆలయం సీతారామ నామ స్మరణతో మార్మోగుతోంది. లౌడ్ స్పీకర్లలో శ్రీరాముడి పాటలు, జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
సుమారు 2.5లక్షల దీపాలు
సోమవారం జనక్‌పుర్ ధామ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అక్కడి నిర్వాహకులు తెలిపారు. అవి ఉదయం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పారు. వేడుకల్లో భాగంగా సింధూరం, పువ్వులతో రాముడి చిత్రాలను రూపొందించనున్నారు. అంతేకాకుండా జనక్‌పుర్ ధామ్‌లోని ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించనున్నారు. సుమారు 2.5లక్షల దీపాలను వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మాంసం, మద్యం అమ్మకాలు బ్యాన్
అయోధ్యలో రామ మందిర ఆరంభోత్సవం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని జనక్‌పుర్ వాసులు చెబుతున్నారు. రామ మందిర నిర్మాణంతో జనక్‌పుర్‌లో ప్రతి వ్యక్తి ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రాణప్రతిష్ట రోజున సాయంత్రం దీపావళిలా వేడుకలు జరుపుకొంటామని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ రోజు నగరంలో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించినట్లు వివరించారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత కచ్చితంగా అయోధ్యకు వెళ్లి రాముడిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటామని స్థానికులు చెబుతున్నారు. అయోధ్యకు జనక్‌పుర్‌కు రైలును ప్రారంభిస్తే సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు.