Ayodhya Ram Mandir Devotees Darshan : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు.
Ayodhya Ram Mandir Hundi Collection : 'బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేయగా, గత 11 రోజుల్లో రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు ఉన్నారు. అయోధ్య రామయ్యకు భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుంది' అని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్‌ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు.
ఆలయ వేళలు పొడిగింపు!
Ayodhya Ram Mandir Temple Timings :భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలక్ రామ్ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి.