Amit Shah At BJP Convention : దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం అంతమయ్యే సమయం ఆసన్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ మూడో విడత పాలనలో దేశం వాటి నుంచి పూర్తిగా విముక్తి పొందనుందని, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్లు ఈ దేశాన్ని నాలుగు దశాబ్దాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారని అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాల్లో భాగంగా దిల్లీలోని భారత మండపంలో అమిత్ షా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
'ఈ ఎన్నికలు మహాభారత యుద్ధం లాంటివి'
లోక్‌సభ ఎన్నికలను మహాభారత యుద్ధంతో అమిత్ షా పోల్చారు. ప్రధాని మోదీ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మరోవైపు బుజ్జగింపులకు పేరుగాంచిన కుటుంబం నడిపే పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోందని అన్నారు. ప్రధాని మోదీ దేశం కోసం, ప్రజల కోసం ఆలోచిస్తారని, కానీ ఇండియా కూటమి తమ పిల్లల్ని సీఎం, ప్రధానిని చేయాలని యోచిస్తుందని విమర్శించారు. బీజేపీలో కుటుంబ పాలన ఉండి ఉంటే చాయ్ అమ్ముకునే వ్యక్తి కుమారుడు ఇవాళ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదని అమిత్ షా గుర్తు చేశారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల కాంగ్రెస్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కూడా రాలేదని విమర్శించారు.