Alert for Going to Ooty and Kodaikanal Tourists : తమిళనాడులో ఉన్న పర్యాటక ప్రాంతాలలో ఊటీ, కొడైకెనాల్ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. భారత్‌లో పర్యటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న రెండో ప్రదేశంగా తమిళనాడు ఉన్నట్లు 2023లో కేంద్ర పర్యాటక విభాగం తెలిపింది. అలాగే.. విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే రాష్ట్రాల జాబితాలో తమిళనాడు ఆరో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. అయితే.. ప్రస్తుత వేసవి సీజన్లో ఊటీ(Ooty), కొడైకెనాల్ వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. అక్కడికి వెళ్లేవారికి 'ఈ-పాస్ విధానం' తప్పనిసరి చేస్తూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలేంటి ఈ-పాస్ విధానం? ఇది ఎందుకు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పర్యాటక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ గురించి వేసిన ఓ పిటిషన్‌ను ఇటీవల విచారించిన మద్రాసు హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు వచ్చే వారికి ఈ-పాస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. సమ్మర్(Summer)హాలీడేస్లో ఊటీకి నిత్యం 1,300 వ్యాన్లతో పాటు 20 వేలకు పైగా వాహనాలు వస్తుంటాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇది విన్న న్యాయస్థానం.. ఒకవేళ ఒకే సమయంలో అన్ని వాహనాలు కొండ ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని, స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని, పర్యావరణం, జంతువులపై ప్రభావం పడుతుందని తెలిపింది.
అందుకే.. కొండ ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్యను నియంత్రించేందుకు కరోనా కాలంలో అనుసరించిన "ఈ-పాస్" విధానాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిది. ఊటీ, కొడైకెనాల్‌లో 'మే 7 నుంచి జూన్ 30' వరకు ఈ- పాస్ విధానాన్ని అమలు చేయాలని నీలగిరి, దిండిగుల్ జిల్లాల కలెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది. ఎన్ని ఈ-పాస్‌లు జారీ చేయాలనే అధికారం వారిదే.