Maharashtra CM Swearing In Ceremony : మహారాష్ట్రలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. సోమవారమే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశముందని శిందే వర్గం శివసేన నేత దీపక్ కేసర్కార్ వెల్లడించారు. సీఎంతో పాటు ఆయన డిప్యూటీలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలిపారు. అయితే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిందే సీఎం రేసులో ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర శాసన సభ గడువు మంగళవారంతో పూర్తికానుంది. గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి పీఠం ఎవరిదంటే?
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహాయుతి నేతలు, బీజేపీ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ కూడా కేవలం 200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు గుర్తు చేశారు.