తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అలా కామెంట్ చేసినందుకే హత్య! క్రైమ్‌ సినిమాను తలదన్నేలా దర్శన్‌​ కేసు - Actor Darshan arrest - ACTOR DARSHAN ARREST

Actor Darshan Arrest Case : కన్నడ నటుడు దర్శన్‌ అరెస్టుకు సంబంధించిన కేసు క్రైమ్‌ సినిమాను తలపిస్తోంది. దర్శన్‌ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నారు. ఇందుకు అభ్యంతరం చెప్పిన తన వీరాభిమానిని కిడ్నాప్‌ చేయించడం సహా ఏకంగా హత్య కూడా చేయించారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి సాంకేతికపరమైన అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని నిర్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

Actor Darshan Arrest Case :`
Actor Darshan Arrest Case (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 4:12 PM IST

Actor Darshan Arrest Case : ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపా అరెస్టుకు దారితీసిన హత్య కేసులో సినీఫక్కీలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈనెల 9న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురికావడం, మృతదేహం బెంగళూరు కామాక్షి పాల్యలోని ఓ మురికి కాలువలో లభ్యం కావడం, మొబైల్ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇందుకు సంబంధించి సాంకేతికపరమైన ఆధారాలు సేకరించి వాటిని నిర్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హత్య నేపథ్యం క్రైమ్‌ సినిమాను తలపించేలా సాగింది. దర్శన్‌ తన భార్యకు దూరంగా ఉంటూ కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడాన్ని దర్శన్‌ వీరాభిమాని అయిన రేణుకాస్వామికి ఏమాత్రం నచ్చలేదు. పవిత్ర తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోలను పోస్టు చేయగా వాటికి రేణుకాస్వామి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. పవిత్ర వల్లే దర్శన్‌ తన భార్యకు దూరంగా ఉంటున్నారని, ఆయన్ను విడిచి వెళ్లిపోవాలంటూ తరచూ పోస్టులు పెట్టేవాడు. ఈ క్రమంలో బెదిరింపులకు కూడా దిగినట్లు పవిత్ర దర్శన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, తన అభిమాన సంఘం నాయకులు, ఇతరులతో కలిసి రేణుకాస్వామిని బలవంతంగా బెంగళూరు తీసుకొచ్చినట్లు తేలింది. ఓ గోదాములో ఉంచి రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి, బలమైన ఆయుధంతో తలపై కొట్టారు. రేణుకాస్వామి చనిపోయిన తర్వాత అతడి మృతదేహాన్ని మురికికాలువలో పడేశారు.

మురికి కాలువలో మృతదేహాన్ని చూసి..
స్థానికుల సమాచారంతో మురికికాలవలో ఉన్న రేణుకాస్వామి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, ఒంటిపై గాయాలు ఉండడం వల్ల పోస్టుమార్టం పరీక్షకు తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలు, ఫోరెన్సిక్‌ నివేదికలు ఆధారంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలోనే దర్శన్‌ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా అరెస్టు చేసి ప్రశ్నించారు. నిందితుల విచారణతో అసలు విషయం బయటకొచ్చింది. రాఘవేంద్ర జాన్‌ 8న చిత్రదుర్గలో ఉన్న రేణుకాస్వామిని బలవంతంగా తీసుకొచ్చి ఓ గోదాములో బంధించాడు. అనుచరులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. CCTV ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ప్రకారం రేణుకాస్వామిని కొడుతున్న సమయంలో దర్శన్‌, పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తేలింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ప్రకారం దర్శన్‌ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాఘవేంద్ర, ఇతరులు కొట్టిన దెబ్బలకు రేణుకాస్వామి చనిపోగా, అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి కామాక్షిపాల్య సమీపంలోని ఓ మురికికాలవలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులకు వారం రోజుల కస్టడీ
మొదట ఓ కారులో రేణుకాస్వామి మృతదేహాన్ని తీసుకెళుతుండగా దానిని వెంబడించిన మరో కారు దర్శన్‌దేనని CCTV ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధరణకు వచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో హత్య జరిగిన ప్రాంతానికి కారులో వచ్చిన దర్శన్, తెల్లవారుజామున మూడున్నరకు వెళ్లిపోయినట్లు CCTV ఫుటేజీ ద్వారా స్పష్టమైంది. ఈ ఆధారాల మేరకు దర్శన్‌, పవిత్రను అరెస్టు చేసిన పోలీసులు, వారికి హత్యతో నేరుగా సంబంధం ఉందనే విషయాన్ని నిర్ధరించాల్సి ఉందని చెబుతున్నారు. నిందితులు చెప్పిన సమాచారం మేరకు ఇద్దరు నటులను అరెస్టు చేశామని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. దర్శన్‌, పవిత్రతోపాటు అరెస్టు చేసిన మరో 11 మంది నిందితులకు కోర్టు వారం రోజుల పోలీసు కస్టడీ విధించింది. దర్శన్‌ సహా నిందితులందరి ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఛాలెంజింగ్‌ స్టార్‌గా పేరున్న దర్శన్, గతంలోనూ అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ : హోంమంత్రి
మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర చెప్పారు. దర్శన్‌ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. దర్శన్‌ తరచూ నేరపూరిత ఘటనలకు పాల్పడుతున్నారనే అంశంపైనా దర్యాప్తు జరుగుతుందని, అవసరమైతే కొత్త సెక్షన్లు కూడా చేర్చి చర్యలు తీసుకుంటారని తెలిపారు. దర్శన్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున ఆయన్ను కాపాడే అవకాశం ఉందనే వాదనను కర్ణాటక హోంమంత్రి తోసిపుచ్చారు.

ABOUT THE AUTHOR

...view details