7 Year Old Boy Teaches UPSC Coaching :ఆ పిల్లాడి వయసు కేవలం 7 ఏళ్లే. కానీ అప్పుడే UPSC, బీటెక్ విద్యార్థులకు పాఠాలు బోధించే స్థాయికి ఎదిగాడు. అది కూడా ఒకటి, రెండు కాదు ఏకంగా 14 సబ్జెక్టుల్లో అభ్యర్థులకు విద్యను బోధిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ మథుర జిల్లాలోని బృందావన్ ప్రాంతానికి చెందిన గురు ఉపాధ్యాయ్ వీరికి పాఠాలు చెబుతూ గూగుల్ గురుగా ప్రసిద్ధి పొందాడు.
'బుల్లి లెక్చరెర్'గా రికార్డు
UPSCకి సన్నద్ధమయ్యే అభ్యర్థులతో పాటు ఇంజినీరింగ్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు గోరా నగర్ కాలనీకి చెందిన గురు ఉపాధ్యాయ్. సుమారు 14 అంశాల్లో అభ్యర్థులకు పాఠాలు చెబుతున్నాడు. ఇలా 5ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బోధిస్తున్నాడు గురు ఉపాధ్యాయ్. ఈ బుడతడి ప్రతిభకు ఇటీవలే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది. అంతేకాకుండా దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన 'బుల్లి లెక్చరెర్'గా రికార్డు సృష్టించాడు.
గురు ఉపాధ్యాయ్‌ను చాలామంది ముద్దుగా గూగుల్ గురు అని కూడా పిలుచుకుంటారు. ఇతడు కేవలం ఆఫ్‌లైన్‌లోనే మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లోనూ అభ్యర్థులకు పాఠాలు బోధిస్తాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్‌నూ నిర్వహిస్తున్నాడు. దీని సాయంతో ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా క్లాసెస్ చెబుతుంటాడు.
17 నెలల వయసులోనే!
ఇక ఈ గూగుల్ గురు (గురు ఉపాధ్యాయ్) అసాధారణ ప్రతిభా పాటవాల గొప్పతనం అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ వరకు చేరింది. ఇది తెలుసుకున్న ఆయన స్వయంగా గురు ఇంటికి వచ్చి మరీ అతడిని ప్రశంసించి సత్కరించారు. గురు 17 నెలల వయసులో ఉన్నప్పుడే చదువు పట్ల అతడిలోని ఆసక్తిని, అసాధారణ ప్రతిభను గమనించారు అతడి తల్లిదండ్రులు. అలా అప్పటినుంచి తమ కుమారుడిని ప్రోత్సహిస్తూ చిన్న వయసులోనే అతి కష్టంగా పరిగణించే సివిల్స్, ఇంజినీరింగ్ సంబంధిత సబ్జెక్టులను నేర్పించారు. ఫలితంగా ప్రస్తుతం ఎంతోమంది యువతీయువకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తరగతులు చెబుతున్నాడు.