Khammam KGBV Girls Hostel News : అమ్మాయిల హాస్టల్లో ఆగంతకులు.. భయంతో అస్వస్థత చెందిన విద్యార్థినులు - ఖమ్మం తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2023, 3:27 PM IST
Khammam KGBV Girls Hostel News : ఓ ప్రభుత్వ విద్యా వసతి గృహంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు తీవ్రంగా భయపడి.. అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వసతిగృహ సిబ్బంది పర్యవేక్షణ లోపించడమే కారణమని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ హాస్టల్లో గత మూడు రోజులుగా ముసుగులు ధరించిన ఆగంతకులు ప్రవేశించి.. బాలికలను భయాందోళన గురి చేస్తున్నారు.
తాజాగా ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు హాస్టల్ వద్దకు వచ్చి అమ్మాయిలను చంపుతామని బెదిరించినట్లు విద్యార్థినులు వాపోయారు. బాలికలు పెద్దగా కేకలు వేయడంతో ఆగంతకులు పారిపోయినట్లు వివరించారు. దీంతో భయాందోళన చెందిన ఐదుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఈఓ సోమశేఖర్ శర్మ విద్యార్థినులను పరామర్శించి.. జరిగిన పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేసి ఆందోళన చేశారు.