ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణనను వెంటనే చేపట్టాలి : జాజుల శ్రీనివాస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 31, 2023, 2:25 PM IST
Jajula Srinivas Goud on BC Caste Census : బీసీ కులాల లెక్క తీస్తేనే, వెనుకబడిన వర్గాలకు రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు బీసీ కుల గణనను వెంటనే చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని జాజుల శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.
మరోవైపు జనవరి 31న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే, బీసీలు అన్యాయానికి గురవుతారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లను తగ్గించి, వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.