ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు.. వారికే గ్యారెంటీ లేదు : మంచిరెడ్డి కిషన్ రెడ్డి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 19, 2023, 8:05 PM IST
Ibrahimpatnam MLA Kishan Reddy on Congress Party : ఆరు గ్యారెంటీల పేరుతో వస్తోన్న కాంగ్రెస్ వాళ్లని నమ్మే పరిస్థితి లేదని.. ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు మొదటగా వారికే గ్యారెంటీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. తాజాగా స్థానిక నియోజకవర్గం పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కాంగ్రెస్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో బూత్ స్థాయి కార్యకర్తలు గెలుపు దిశగా ఏ విధంగా అనుసరించాలో.. దిశా నిర్దేశం చేశారు.
ఇప్పటికే మూడుసార్లు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ప్రజలు సేవ చేసే అవకాశం కల్పించారని.. మరోసారి కూడా అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని.. కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. ఇటీవల ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో సబ్బండ వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.