పెద్దపల్లిలో కుక్కల స్వైర విహారం.. చిన్నారిపై దాడి - telangana latest news
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో రోజురోజుకు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిన్నారులపై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. తెలంగాణ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల స్వైర విహారం కొనసాగుతోంది. తాజాగా నగరంలోని 48వ డివిజన్ మారుతీ నగర్‌లో ఓ పిల్లవాడిపై కుక్క దాడి చేసింది. రోడ్డుపై ఒంటరిగా నడుస్తూ వెళుతున్న పిల్లవాడిపై వెనక నుంచి పరుగున వచ్చి దాడికి పాల్పడింది. ఈ ఘటనతో పిల్లవాడు కింద పడిపోయాడు. దానిని చూసి అక్కడున్న స్థానికులు కుక్కను తరిమేశారు. చిన్నారి చేతికి గాయాలవడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటన అంతా సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కుక్క దాడి దృశ్యాలు బయటకి రావడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అయింది. నగరంలో కోతులు, పందులు, కుక్కల దాడులు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో అంబర్పేట్లో చిన్నారిపై జరిగిన కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తీవ్ర సంచలనం సృష్టించింది.