Karimnagar Cable Bridge Cracks : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి.. ప్రారంభించి నెల కాకముందే పగుళ్లు - karimnagar cable bridge approach road cracks
🎬 Watch Now: Feature Video
Cracks on Karimnagar Cable Bridge : కరీంనగర్ మానేరు తీరం సమీపంలో రూ.400 కోట్లతో నిర్మించిన తీగల వంతెన రహదారిపై పగుళ్లు ఏర్పడ్డాయి. గత నెలలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీగల వంతెనను అట్టహాసంగా ప్రారంభించారు. నాలుగు వారాలు గడవకముందే గోడలపై పగుళ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వంతెనపై నిరసనకు దిగాయి. నాణ్యతలేని పనులు చేపట్టడంతో పగుళ్లు ఏర్పడ్డాయని.. సదరు గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తిరిగి వారికే రైల్వే బ్రిడ్జి పనులను కేటాయించడంతో, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కమలం నాయకులు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన సదరు కాంట్రాక్టర్ రహదారిపై మరమ్మతు పనులను చేపట్టారు.
మరోవైపు తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ నగరం సురక్షితంగా ఉందని.. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు పేర్కొన్నారు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక ప్రతి సమస్యను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై చిన్న సమస్య ఏర్పడితే వారు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్రిడ్జిలు కుప్పకూలుతున్నా పట్టించుకునే వారే లేరని సునీల్‌రావు ఆరోపించారు.