Benefits Of Vitamin A : మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు కావాలి. వీటిల్లో ఏది లోపించినా రోగ నిరోధక శక్తి తగ్గి వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో వేటి పాత్ర అదే. విటమిన్లు మన జీవక్రియ సాఫీగా సాగడానికి సాయపడతాయి. అలాంటి వాటిల్లో విటమిన్ - ఏ ముఖ్యమైంది. ఇది ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ముఖ్యంగా కంటి చూపు మెరుగు పర్చుకోవడానికి దోహదం చేస్తుంది. మరి అలాంటి విటమిన్ ఎందులో లభిస్తుంది, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
Vitamin A Uses In The Body : కంటి చూపును మెరుగ్గా ఉంచేది విటమిన్- ఏ. రెటీనాలో వర్ణ ద్రవాల్ని ఏర్పర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల, ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం. అంతేకాకుండా ఇది పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక శక్తిమంతమైన ఆంటీ యాక్సిడెంట్. అంటువ్యాధులతో పోరాడుతుంది. గర్భదారణ సమయంలో పిండంలో కలిగే లోపాల్ని నివారించడానికి, పిల్లలకు పాలిచ్చేందుకు మహిళలకు విటమిన్ - ఏ ఎంతో అవసరం.
పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు తదితర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్ని తినటం వల్ల తగినంత విటమిన్ - ఏ లభిస్తుంది. ఇది పురుషులకు 1000 మైక్రో గ్రాములు, మహిళలకు 840 మైక్రో గ్రాములు అవసరం. అదే గర్భిణులకు అయితే 900 మైక్రో గ్రాములు కావాలి. పాలిచ్చే తల్లులకు 940 మైక్రో గ్రాములు అవసరం. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే పండ్లలో ఎక్కువగా దొరుకుతుంది. పాలు, యోగర్ట్, పెరుగు, చేపలు, చేప నూనెల్లో, లివర్, ఆకుకూరల్లో అధికంగా లభిస్తుంది.
Vitamin A Deficiency Diseases : శరీరంలో విటమిన్ - ఏ లోపం వల్ల దృష్టి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. విటమిన్ - ఏ లోపం కారణంగా రేచీకటి వచ్చే ప్రమాదమెక్కువగా ఉంది. ఈ లోపం తీవ్రంగా రెటీనా, కార్నియా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. చర్మం పొరబారటం, దురద, పొలుసులుగా రావడం సంభవిస్తుంది. కళ్లు పొడిబారటం, రేచీకటి, చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. దీన్ని మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఉండేట్లు చూసుకోవాలి.
దొరికే పదార్థాలివే..
Vitamin A Rich Foods : ఈ విటమిన్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీర పెరుగుదల, అభివృద్ధిలో సాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సరిగా ఉండాలన్నా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా విటమిన్ - ఏ ఎంతో అవసరం. పాలకూర 100 గ్రాములు తీసుకుంటే అందులో 50 శాతం విటమిన్ - ఏ ఉంటుంది. 100 గ్రాముల ట్యూనా చేపల్లో 750 మైక్రో గ్రాములు, 100 గ్రాముల కందగడ్డలో 950 మైక్రో గ్రాముల విటమిన్ - ఏ లభిస్తుంది. అటు మంసాహారం, శాకాహారం రెండింటిలోనూ ఇది దొరుకుతుంది. లివర్, ఆయిల్ ఫిష్, గుమ్మడి కాయ, క్యారెట్, ఎర్ర కాప్సికం, చిలగడదుంపలు, పాలు తదితర పదార్థాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.
దీన్ని సరైన పాళ్లలో తీసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. రోగ నిరోధక శక్తిని బూస్ట్ చేసి క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహకరిస్తుంది. మరోవైపు విటమిన్ - ఏను అవసరానికి మించి అధిక మోతాదులో తీసుకుంటే ప్రమాదమే. వీటి సప్లిమెంట్లను వైద్యుల సలహా మేరకు మాత్రమే వేసుకోవాలి.
ఇవీ చదవండి : ఇమ్యూనిటీ కోసం తీసుకోవాల్సిన A B C Dలు ఇవే!
కంటి సమస్యలతో బాధపడుతున్నారా?.. ఈ ఫుడ్ ఐటమ్స్‌తో చెక్ పెట్టేయండి మరి!