Type 2 Diabetes : సాధారణంగా (మధుమేహం) డయాబెటిస్‌ను చాలా మంది ముందుగా గుర్తించలేరు. శరీరంలో చాలా కాలం నుంచి ఆ వ్యాధి ఉన్నా.. వ్యాధి తీవ్రమైన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ చాలా ఆలస్యంగా లక్షణాలు చూపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. టైప్-2 డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే.. వ్యాధి నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
టైప్-2 డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించకపోతే.. అప్పటికే శరీరంలోని చాలా అవయవాలు వ్యాధికి ప్రభావితం అవుతాయి. అలా కాకుండా ఉండాలంటే, ముందుగానే అప్రమత్తమై.. ఆహారంలో, జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలి. అలాగే వైద్యుల సలహాపై మెడిసిన్ తీసుకొవాలి. దీని ద్వారా సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.
Types Of Diabetes : డయాబెటిస్ రెండు రకాలు. అవి టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్. టైప్-1 డయాబెటిస్ వంశపారంపర్యంగా వస్తుంది. ఇక టైప్-2 విషయానికొస్తే.. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక బరువు కారణంగా వస్తుంది. ఒక్కోసారి టైప్-2 డయాబెటిస్‌ను మందులతో నియంత్రించినా.. తరువాత ప్రతి రోజూ ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
టైప్-2 డయాబెటిస్ లక్షణాలు..
Diabetes Symptoms : రక్తంలో చక్కెర శాతం మోతాదుకు మించి ఉండడాన్ని మధుమేహం (డయాబెటిస్) అంటారు. ఈ వ్యాధి వల్ల.. ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, అధిక దాహం, కంటి చూపు మందగించడం, శరీర బరువు తగ్గడం, అరికాళ్ళలో మంటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Diabetes Related Diseases : డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. కంటి చూపు మందగిస్తుంది. కిడ్నీలు దెబ్బతింటాయి. నాడీ వ్యవస్థపై ప్రభావం పడడం వల్ల నడవడం కూడా కష్టమవుతుంది. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Diabetes Treatment Food : టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. సరైన సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే టైప్-2 డయాబెటిస్‌ను చాలా వరకు నియంత్రించవచ్చు.
వ్యాయామం మంచి చేస్తుంది!
Diabetes Exercise At Home : వ్యాయామం చేయడం వల్ల కండరాలు గట్టిపడతాయి. తద్వారా కణాలకు ఇన్సులిన్ గ్రహించే శక్తి పెరుగుతుంది. ఎండార్ఫిన్, సెరొటోనిన్ల ఉత్పత్తి పెరగడం వల్ల ఉల్లాసం కలుగుతుంది. ఫలితంగా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Diabetes Treatment : టైప్-2 డయాబెటిస్ రాకుండా ముందు నుంచే జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం శరీర బరువును అదుపులో పెట్టుకోవాలి. తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. రోజుకు అరగంట వాకింగ్, ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు దినచర్యలో భాగం చేసుకోవాలి. పని ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా మోతాదులోనే తీసుకోవాలి.
How To Prevent Diabetes : ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలితో టైప్-2 డయాబెటిస్ దరిచేరకుండా చూసుకోవచ్చు. వ్యాధి వచ్చిన తర్వాత కూడా సరైన జాగ్రత్తలు పాటిస్తే.. ఇతర దుష్పరిణామాలను అరికట్టవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు.. వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి ఉందో? లేదో? వైద్యులు నిర్ధరణ చేస్తారు. వ్యాధి తీవ్రతను అనుసరించి మందులు వాడమని లేదా జీవనశైలిలో మార్పులు చేసుకోమని సూచిస్తారు. ఈ విధంగా మీరు టైప్-2 డయాబెటిస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.