Tonsils Ayurvedic Home Remedy in Telugu : మనలో చాలామంది టాన్సిల్స్ సమస్యతో బాధపడుతుండటం తరుచూ చూస్తుంటాం. మన ఇంట్లోని చిన్న పిల్లలు, కొన్ని సందర్భాల్లో పెద్దలు ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే టాన్సిల్స్ అనేవి ఆస్పత్రికి వెళ్లాల్సినంత ఆరోగ్య సమస్య కాదు, అలా అని పట్టించుకోనంత పరిస్థితి కాదు. దీనికోసం ఆయుర్వేదంలో ఎంతో చక్కటి ఉపాయం ఉంది. టాన్సిల్స్ సమస్య నుంచి విముక్తి కోసం ఆయుర్వేదం మార్గంలో చక్కటి కషాయం తయారు చేసుకోవచ్చు. కషాయం ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో వివరించడం సహా ఉపశమనం కోసం ఏం చేయాలో కూడా ఆయుర్వేదంలో వివరించారు.
"టాన్సిల్స్ లేదా టాన్సిలైటిస్‌తో బాధపడే వాళ్లు పటిక భస్మాన్ని వేడి నీటిలో కలిపి వాడటం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే తిప్పతీగ, యష్టిమధు, గుగ్గిళ్లు, తేనెతో తయారు చేసే కషాయాన్ని క్రమం తప్పకుండా వాడితే అతి తక్కువ సమయంలో టాన్సిల్స్ నుంచి విముక్తి పొందవచ్చు."
-డా.గాయత్రీ దేవి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
ఉపశమనం కోసం ఇలా చేయండి:
టాన్సిల్స్ నుంచి ఉపశమనం కోసం ముందుగా పటికను తీసుకోవాలి. పటిక యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. పటికను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మూకుట్లో వేసి పాప్ కార్న్ మాదిరి పొంగించుకోవాలి. దీని వల్ల పటికలోని నీరు అంతా ఎగిరిపోతుంది. దానిని చేతిలో ఒత్తుకుంటే పొడి వస్తుంది. దీనినే పటిక (స్పటిక) భస్మం అంటారు. టాన్సిలైటిల్ లేదా టాన్సిల్స్ సమస్యతో ఉన్న వాళ్లు ఉపశమనం కోసం దీనిని ఉపయోగించుకోవాలి. వేడి నీళ్లను ఒక కప్పు తీసుకొని, అందులో అరచెంచా పటిక భస్మాన్ని వేసి కలుపుకోవాలి. ఈ నీటిని గొంతు వరకు చేరేలా పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల టాన్సిల్స్‌తో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం ఇలా పుక్కిలించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది.
టాన్సిల్స్ కోసం కషాయం:
కషాయం తయారీకి తిప్పతీగ, యష్టిమధు, గుగ్గిళ్లు, పటిక, తేనె అవసరం అవుతాయి. చక్కటి యాంటీ బయోటిక్‌గా పని చేసే తిప్పతీగను చూర్ణం లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న 50 గ్రాముల తిప్పతీగ చూర్ణాన్ని ఒక పాత్రలో వేసుకోవాలి. గొంతుకు మేలు చేసే యష్టిమధు చూర్ణాన్ని 50 గ్రాములు తీసుకొని అదే పాత్రలో వేసుకోవాలి. యాంటీ బయోటిక్‌గా పని చేసే శుద్ధి చేసిన గుగ్గిలను చూర్ణంగా చేసుకొని, ఈ చూర్ణాన్ని 50గ్రాములు తీసుకొని పాత్రలో వేసుకోవాలి. ఇలా 50 గ్రాముల తిప్పతీగ చూర్ణాన్ని, 50 గ్రాముల యష్టిమధు చూర్ణాన్ని, 50 గ్రాముల శుద్ధి చేసిన గుగ్గిళ్లను తీసుకొని, అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని కషాయం తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు.
స్టవ్ మీద ఒక పాత్రను ఉంచి, అందులో ఒక కప్పు నీళ్లను మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఒక చెంచా పొడిని అందులో వేసుకోవాలి. కప్పు నీళ్లు మరిగి అరకప్పు అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. తర్వాత నీళ్లను వడకట్టి కాస్త గోరువెచ్చగా కానివ్వాలి. కాస్త గోరువెచ్చగా మారిన తర్వాత చెంచా తేనెను కలుపుకోవాలి. అంతే టాన్సిల్స్ నుంచి విముక్తి కలిగించే కషాయం సిద్ధమైనట్లే. టాన్సిల్స్‌తో బాధపడే వాళ్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 30-40మి.లీ కషాయాన్ని తాగితే ఆ బాధ నుంచి విముక్తి పొందుతారు.
సడెన్‌గా గుండె ఎందుకు ఆగిపోతుంది? హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?