‘ఏది తిన్నా వికారంగా అనిపిస్తోంది.. తీసుకున్న ఆహారం సరిగ్గా అరగట్లేదు.. ఏంటో ఈ సమస్య’ అని తలపట్టుకుంటోంది సునీత.
వినీత కూడా ఇదే సమస్యతో బాధపడుతోంది. అంతేకాదు.. అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తోందని వాపోతోంది.
నిజానికి మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు.. జీర్ణవ్యవస్థలో తలెత్తే ఇలాంటి సమస్యల్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం.. అదే తగ్గిపోతుందిలే అంటూ నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఇలాంటి లక్షణాలు పొట్ట ఇన్ఫెక్షన్/స్టమక్ ఫ్లూకు సూచితం అంటున్నారు నిపుణులు. ఇలా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల దీని ప్రభావం ఇతర అవయవాల పనితీరుపై కూడా పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో పలు మార్పులు-చేర్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
స్టమక్ ఫ్లూ/పొట్ట సంబంధిత ఇన్ఫెక్షన్.. ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ జీర్ణ వ్యవస్థపై దాడి చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ట్రోఎంటరైటిస్‌గా పిలిచే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా వికారం, వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి.. వంటి దుష్ప్రభావాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా కేవలం శారీరక ఆరోగ్యం పైనే కాదు.. మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీసే ఈ ఇన్ఫెక్షన్‌కి మనం తీసుకునే ఆహారమే విరుగుడు అంటున్నారు నిపుణులు.
ఏవి తీసుకోవాలి?
- పొట్ట ఇన్ఫెక్షన్ కారణంగా అయ్యే వాంతులు, విరేచనాల వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో నీటిని కోల్పోతుంది. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం-పుదీనాతో తయారుచేసిన హెర్బల్ టీ, బ్రాత్ (మాంసం లేదా కాయగూరలు ఉడికించిన నీళ్లు).. వంటివి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా సమస్య తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా అందుతుంది.
- ఈ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు/వంటకాలకే అధిక ప్రాధాన్యమివ్వాలంటున్నారు. ఈ క్రమంలో పెసరపప్పు-బియ్యంతో చేసుకునే కిచిడీ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్ అందుతుంది.
- మనకేదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు గుడ్లు-మాంసం వంటివి చూస్తేనే వికారం వస్తుంటుంది. కానీ పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారు కోడిగుడ్లను స్నాక్‌గా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే ‘బి’ విటమిన్లు, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహకరిస్తుందట! తద్వారా ఎలాంటి అనారోగ్యాన్నైనా దూరం చేసుకోవచ్చన్నమాట! అలాగే మాంసం తీసుకోవాలనుకున్న వారు స్కిన్‌లెస్‌ని ఎంచుకోవడం మంచిది.
మనం ఆహారంలో భాగంగా తీసుకునే సూప్స్ కూడా పొట్ట ఇన్ఫెక్షన్‌ని దూరం చేసి.. జీర్ణ శక్తిని పెంచుతాయి. అంతేకాదు.. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.- పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారికి బ్రాట్(బీఆర్ఏటీ) డైట్ మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా అరటిపండ్లు(బనానా), అన్నం (రైస్), యాపిల్‌సాస్ (ఆపిల్ సాస్), టోస్ట్ (టోస్ట్).. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించడంతో పాటు వాటిలోని ఇతర పోషకాలూ శరీరానికి అందుతాయి.
ఇవి వద్దు!
- ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్.. వంటి పదార్థాల్లో కొవ్వులు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అంత సులభంగా జీర్ణం కావు.. పైగా వాటి కారణంగా ఫ్లూ లక్షణాల తీవ్రత మరింత ఎక్కువవుతుంది.
- మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే వికారం, వాంతులయ్యే అవకాశాలే ఎక్కువ.
- శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి పండ్ల రసాలు తాగుతుంటారు కొంతమంది. కానీ వాటిలో ఉండే అధిక చక్కెరలు విరేచనాల సమస్యను మరింతగా పెంచుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి పొట్ట ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు.
- పచ్చి కాయగూరలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వీటిని తీసుకొని బాధపడడం కంటే దూరంగా ఉండడమే బెటర్.
- పొట్ట ఇన్ఫెక్షన్‌లో భాగంగా పొట్ట ఉబ్బరంగా అనిపించినప్పుడు ఓ కప్పు కాఫీ/టీ తాగి రిలాక్సవుదామనుకునే వారూ లేకపోలేదు. కానీ వీటిలోని కెఫీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలట!
ఇవీ మేలు చేస్తాయ్!
- పొట్ట ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తిన వాంతులు, వికారం.. వంటి లక్షణాలను దూరం చేసుకోవడానికి ఆక్యుప్రెజర్/ఆక్యుపంక్చర్ చికిత్సలు మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఫ్లూ కారణంగా వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీటింగ్ ప్యాడ్/హాట్ బ్యాగ్ చక్కటి ప్రత్యామ్నాయం. ఇది అందుబాటులో లేని వారు వేడి నీళ్లలో ముంచి పిండిన కాటన్ వస్త్రంతో పొట్టపై కాపడం కూడా పెట్టుకోవచ్చు.
- ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్ర పోవడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడగట్టుకుంటుందని సలహా ఇస్తున్నారు.
ఇలా ఇవన్నీ చేసినా ఈ సమస్య నుంచి విముక్తి పొందలేకపోతున్నారంటే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి! తద్వారా వారు సూచించిన మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.
- ఇదీ చదవండి : ఇమ్యూనిటీ సప్లిమెంట్లతో చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు