దుమ్మూధూళి, ఎండ, కాలుష్యం.. ఇలా చాలా అంశాలు మన చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తాయి. అందుకే వారానికోసారైనా వీటిపై శ్రద్ధ చూపించాలి. సంరక్షణా చర్యలు చేపట్టాలి. అందుకోసం పాలపొడి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేగాక ఎంతో మేలు కూడా చేస్తాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
- పాలపొడిలో విటమిన్లు, మినరల్స్ అధికమొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తుంది. కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి అంతే పరిమాణంలో టీ డికాక్షన్ నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ చొప్పున పాలపొడి, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కొంటే మృతకణాలు తొలగి మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.
- టేబుల్ స్పూన్ పాలపొడిలో, నాలుగు టేబుల్ స్పూన్ల కీరదోస ముక్కలు, టేబుల్ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల తాజా అనుభూతితో పాటు చర్మం నిగనిగలాడుతుంది.
- ముప్పావు కప్పు గులాబీ నీటిలో, రెండు టేబుల్ స్పూన్ పాలపొడి, కొద్దిగా పెరుగు, టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్, తేనె కలిపి ముఖానికి పూతలా వేయండి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు దూరమవుతాయి. చర్మం తాజాగా మెరిసిపోతుంది.
ఇదీ చూడండి: ఒకసారి శృంగారం.. ఎన్ని మైళ్ల నడకకు సమానమో తెలుసా?