హృద్రోగ సమస్యల్లో భారత్ త్వరలో అమెరికాను దాటేసే పరిస్థితులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల బైపాస్ సర్జరీలు జరుగుతుంటే.. అత్యధికంగా అమెరికాలో 2 లక్షలు, మన దేశంలో 1.6 లక్షల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. గతంతో పోల్చితే గుండె ధమనుల (కరోనరీ ఆర్టరీ) సమస్యలు పెరిగాయి. జీవనశైలిలో మార్పులు.. ఆహారపుటలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలు’ అంటూ హెచ్చరించారు పలువురు వైద్యనిపుణులు. సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్ల రెండు రోజుల సదస్సు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్‌లో శనివారం ప్రారంభమైంది. దేశంలోని పలు ఆసుపత్రులకు చెందిన కార్డియో థొరాసిక్ (సీటీ) సర్జన్లు, కార్డియాలజిస్టులు పాల్గొన్నారు. అవగాహనతోనే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వారు సూచించారు. తమకు గుండె సమస్యలు రావనే ధీమా ఎవరికీ పనికిరాదన్నారు. పాశ్చాత్య జీవనశైలి దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. సంప్రదాయ ఆహారపుటలవాట్ల స్థానంలో రెడీమేడ్, ప్యాకెట్ ఫుడ్స్ కారణంగా కూడా ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు పెరిగి గుండె ధమనుల (కరోనరీ ఆర్టరీ) సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
చాలామందికి గుండె ధమనుల్లో 50 శాతం పూడికలు ఉన్నా సరే... బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అంతమాత్రాన గుండె ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లు కాదు. ఇలాంటి వారికి ట్రెడ్‌మిల్ టెస్టు నిర్వహిస్తే బ్లాకులు బయటపడతాయి. - వైద్య నిపుణులు
జీవనశైలి వ్యాధులతో అత్యధిక మరణాలు..
'సమాజంపై రోజురోజుకు జీవనశైలి వ్యాధుల భారం పెరుగుతోంది. అధిక రక్తపోటు, మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దాదాపు 63 శాతం మరణాలకు జీవనశైలి వ్యాధులే కారణం. ఇందులో కరోనరీ ఆర్టరీ ఇబ్బందులతో చాలామంది మృతి చెందుతున్నారు. వీటిపై అవగాహన, చైతన్యం అవసరం. ఇలాంటి సదస్సులలో చర్చించి ప్రభుత్వాలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.' - ప్రొఫెసర్ కె.శ్రీనాథ్‌రెడ్డి, అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
రోబోటిక్, ఎండోస్కోపిక్ విధానాలపై చర్చిస్తున్నాం..
'హృద్రోగ సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించేందుకు సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్ల సదస్సులో చర్చిస్తున్నాం. బైపాస్ అవసరం లేకుండా.. పూర్తిగా ఎండోస్కోపిక్ లేదా రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్సల వల్ల రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ విధానాల్లో సంక్లిష్టతలపై కూడా పూర్తిగా చర్చించాలి. గతంతో పోల్చితే గుండె జబ్బులు పెరిగినా, అదే స్థాయిలో అవగాహన కూడా వచ్చింది. జిల్లా కేంద్రాల్లో కూడా త్వరితగతిన చికిత్సలు అందుతున్నాయి. ఇది సరిపోదు. ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి.'- డాక్టర్ మన్నం గోపీచంద్, ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు
ఈ లక్షణాలుంటే జాగ్రత్త..
'తరచూ ఛాతీలో అసౌకర్యం, దవడ, చేయి లాగినట్లు అనిపించడం, అలసట లాంటి లక్షణాలు వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం, మంచి ఆహారపుటలవాట్లు, కనీసం ఆరు గంటలసేపు నాణ్యమైన నిద్ర అవసరం. 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా గుండె పరీక్షలు చేయించుకోవాలి. రక్త సంబంధీకుల్లో ఎవరికైనా గుండె సమస్యలుంటే.. మరింత అప్రమత్తంగా ఉండాలి. బైపాస్ సర్జరీ చాలా సురక్షితమైంది. ఈ సర్జరీ తర్వాత కూడా 20-25 ఏళ్ల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు.'- డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, సీనియర్ కార్డియో థొరాసిక్ శస్త్రచికిత్స నిపుణులు
ప్రమాదకర అలవాట్లున్నవారు శాతాల్లో..
* ధూమపానం 32.8
* మద్యపానం 15.9
* శారీరక శ్రమ లేమి 41.3
* ఉప్పు వాడకం రోజుకు 3 గ్రాములకు మించకూడదు. కానీ 8 గ్రాములకు పైగా తీసుకుంటున్నారు. ఇవన్నీ గుండె ధమనుల సమస్యలకు దారితీస్తున్నాయి.
ఇవీ చదవండి: