Proven Ways to Lose Weight Without Diet : ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనుషులకు అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. సాంప్రదాయ ఆహారాన్ని వదిలిపెట్టి పిజ్జా, బర్గర్, ఫ్రైడ్‌రైస్ లాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల అధిక బరువుతో బాధపడుతున్నారు. బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ కలిగించే పనులు, వ్యామాయం చేయకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతున్నారు. ఒక్కసారి బరువు పెరిగిన తర్వాత తగ్గాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బరువు తగ్గేందుకు చాలా మంది ఆహార నియమాలు పాటించడంతో పాటు వ్యామాయం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి డైట్ చేయకుండా కూడా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. అదెలానో చూసేద్దామా..?
అల్పాహారం మానేయవద్దు
Don't Neglect Your Breakfast : బరువు తగ్గేందుకు చాలామంది ఆల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం మితంగా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం మానేయడం వల్ల బరువు తగ్గకపోగా.. ఇంకా పెరుగుతారు. రోజంతా శరీరానికి శక్తిని అందించేందుకు అల్పాహారంలో పోషకాలను అందించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్ మానేయడం మంచిది కాదు. కొవ్వు పదార్థాలు బరువును పెంచుతాయనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదు. కొన్ని కొవ్వు పదార్థాలు బరువును కూడా తగ్గిస్తాయి. నెయ్యి, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. దీంతో మనం తీసుకునే ఆహారంలో వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.
జంక్ ఫుడ్ జోలికి పోవొద్దు
Junk food effects on body : బరువు తగ్గాలనుకునేవారు జంక్ ఫుడ్‌కి పూర్తిగా దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్‌లో సోడియం, నూనె, చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువును మరింత పెంచుతాయి. వాటికి ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కూరగాయలు, పండ్లు తీసుకోండి
Fruits and vegetables for weight loss : బరువు తగ్గాలనుకునేవారు తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, చేపలు లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే తాము చేసే పనిని అనుసరించి ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు శరీరానికి కేలరీలు ఎక్కువ అందించే ఆహారం తీసుకోవాలి. కూర్చోని పనిచేసేవారు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఇక వ్యామాయాలు చేసేవారు తమ శ్రమకు తగ్గట్లు ఆహారాన్ని తీసుకోవాలి.
బరువును తగ్గించే క్యాప్సికం
Capsicum for weight loss : పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇక క్యాప్సికం కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్ రూపంలో తీసుకోండి. క్యాప్సికంలో ఉండే క్యాప్సికన్ అనే పదార్థం బరువును తగ్గిస్తుంది. వీటితోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చిక్కుళ్లు, మొలకెత్తిన పెసళ్లు, అలసందలు లాంటి పదార్థాలను తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువ మోతాదులో తీసుకుని కేలరీలు ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. దీని వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. వీటితో పాటు ఉదయం వ్యామాయం చేయడం, సరైన నిద్ర కలిగి ఉండటం వల్ల బరువు తగ్గవచ్చు.