చాలామందికి కొవిడ్-19 తేలికగానే తగ్గిపోతున్నప్పటికీ కొందరికి తీవ్రంగానూ, ప్రాణాంతకంగానూ పరిణమిస్తోంది మరి. ఒంట్లో నిరంతరం స్వల్ప స్థాయిలో సాగే వాపు ప్రక్రియ (క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్). ఇది పైకేమీ తెలియకుండా లోలోపలే దహించివేస్తుంటుంది. కాబట్టే ఇప్పుడంతా దీన్ని నివారించే జీవనశైలి మీదే దృష్టి సారిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది ఊబకాయాన్ని తగ్గించుకోవటం. ఆహార, వ్యాయామ పద్ధతులతో ముడిపడిన ఇది దీర్ఘకాల వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడుతుంది.
వాపు ప్రక్రియ రెండు వైపులా పదునైన కత్తి. అవసరమైన సమయాల్లో శరీరాన్ని సంరక్షిస్తుంది. అనవసరంగా ప్రేరేపితమైతే అవయవాలను దెబ్బతీస్తుంది. వాపు ప్రక్రియ మన రక్షణ వ్యవస్థలో అంతర్భాగం. ఏదైనా గాయమైందనుకోండి. లేదూ ఇన్‌ఫెక్షన్ తలెత్తిందనుకోండి. వెంటనే రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించి వాపు ప్రక్రియను ప్రేరేపించే సైటోకైన్లను విడుదల చేస్తుంది. జ్వరం, నొప్పి, ఎరుపు, ఉబ్బు వంటివన్నీ దీని ఫలితాలే. దీన్నే అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్ అంటారు. గాయం, ఇన్‌ఫెక్షన్ తగ్గుముఖం పడుతున్నకొద్దీ వాపు ప్రక్రియను అదుపుచేసే సైటోకైన్లు పుట్టుకొస్తాయి.
క్రమంగా వాపు ప్రక్రియ సైతం నెమ్మదిస్తూ వస్తుంది, పూర్తిగా కనుమరుగైపోతుంది. కానీ చిక్కంతా దీర్ఘకాల (క్రానిక్) వాపు ప్రక్రియతోనే. ఎలాంటి ఇన్‌ఫెక్షన్ లేకపోయినా ఇది కణస్థాయిలో, స్వల్పంగా నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. ఒంట్లో ఏదో ముప్పు తలెత్తిందనే భావనతో అవసరం లేకపోయినా రోగనిరోధక ప్రతిస్పందన ప్రేరేపితం కావటం దీనికి వలం. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటివేవీ లేకపోవటం వల్ల సైటోకైన్లు మన కణాలు, అవయవాల మీదే దాడి చేస్తాయి. అంటే మన రక్షణ వ్యవస్థే మనకు శత్రువుగా మారుతుందన్నమాట. గుండెజబ్బులు, కీళ్లవాతం, మధుమేహం, అల్జీమర్స్, కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే కారణమవుతోంది. కొవిడ్-19 బాధితుల్లోనూ గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ, సైటోకైన్లే ప్రమాదకరంగా మారుతుండటం చూస్తున్నదే. అప్పటికే దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితమై ఉన్నవారికిది మరింత విషమంగానూ పరిణమిస్తోంది.
ఇదీ చదవండిః మీ పిల్లలను చిరుతిళ్ల నుంచి దూరం చేయండిలా..!