Hair Wash Tips in Telugu : "సూపర్‌గా ఉన్నావు.. లుక్ అదిరిపోయింది" అనే ప్రశంసలు పొందాలంటే మీ ముఖ తేజస్సుతో పాటు హెయిర్ స్టైల్ కూడా ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే చాలా మంది ఆడ, మగ అనే తేడా లేకుండా జుట్టు సంరక్షణపై శ్రద్ధ పెడతారు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు.. మరెన్నో రకాల టిప్స్‌తో పాటు వివిధ రకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు సంరక్షణకు తలస్నానం(Head Bath) అనేది చాలా కీలకం. కాగా, ఈ తలస్నానం విషయంలో చాలా మందికి.. ఎప్పడెప్పుడు హెడ్ బాత్ చేయాలి? రోజూ చేయొచ్చా? లేదా వారంలో ఎన్ని సార్లు చేయాలి? అనే సందేహలు వస్తుంటాయి. మీ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
నిపుణులు ఏం చెబుతున్నారంటే.. వారంలో తలస్నానం ఎన్నిసార్లు చేయాలి అనేది అందరికి ఒకేలా ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అది వారి వ్యక్తిగత అవసరాలు, జీవన శైలి, జుట్టు రకంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం.. తల మీద ఉన్న స్కిన్ ఉత్పత్తి చేసే నూనె మొత్తాన్ని బట్టి తలస్నానం చేసే ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలి. జుట్టు జిడ్డుగా ఉంటే, ప్రతిరోజూ వాష్ చేసుకోవడం మంచిది. అలా చేయడం ద్వారా వెంట్రుకలు క్లీన్‌గా ఉంటాయి. ఇకపోతే పొడి జుట్టు, సున్నితమైన తల చర్మం ఉన్న ఉన్నవారు హెయిర్ వాష్‌ల మధ్య కొన్ని రోజుల విరామం తీసుకోవడం ఉత్తమం.
నిపుణుల ప్రకారం జుట్టు రకం ఆధారంగా ఎవరెవరు ఎన్ని రోజులకు ఒకసారి తలస్నానం చేయాలో ఇప్పుడు చూద్దాం..
జిడ్డు జుట్టు : కొంతమందికి తల ఎప్పుడూ జిడ్డుగా ఉంటుంది. దీంతో జుట్టు నేచురల్‌గా కనిపించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటివారు తలలోని అదనపు ఆయిల్, జిడ్డును వదిలించుకోవాలంటే, తరచుగా హెడ్ బాత్ చేయాలి. అవసరమైతే రోజూ తల స్నానం చేయడం ఉత్తమం.
కలర్ ట్రీటెడ్ జుట్టు : చాలా మందికి మారిన ఆహారశైలి కారణంగా వైట్ హెయిర్ వస్తోంది. దీంతో ఆ సమస్య నుంచి బయటపడడానికి జుట్టుకు రంగు వేస్తుంటారు. అలాంటి వారు వెంట్రుకల ఆరోగ్యంతో పాటు వాటి రంగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తరచుగా హెయిర్ వాష్ చేస్తే, రంగు త్వరగా ఫేడ్ అవుతుంది. అందుకే వీరు కొన్ని రోజులకు ఒకసారి మాత్రమే తలస్నానం చేయడం బెటర్.
Hair Growth Tips : జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగాలా? ఈ పనులు అస్సలు చేయకండి
పొడి జుట్టు : చాలా మందికి హెయిర్ పొడిగా ఉంటుంది. ఇలాంటి వారు తరచుగా తలస్నానం చేయకూడదు. అలా చేస్తే తలలోని సహజ నూనెలు తగ్గిపోయి.. వెంట్రుకలు మరింత పొడిగా మారుతాయి. జుట్టు రాలే సమస్యకు కూడా దారితీయవచ్చు. కాబట్టి మీ ప్రాధాన్యత, జుట్టు అవసరాలను బట్టి కొన్ని రోజులకు లేదా వారానికి ఒకసారి తలస్నానం చేయడం మంచిది.
కాంబినేషన్ జుట్టు : కొందరికి హెయిర్ అడుగు భాగం జిడ్డుగా, చివర్లు పొడిగా ఉంటాయి. ఇలాంటి జుట్టు ఉన్నవారు బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాలి. ముఖ్యంగా తల చర్మం మూలాలను శుభ్రపరచడంపై దృష్టి సారిస్తూ, ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేయాలి. ఇలా చేస్తే.. ఆయిల్ కంట్రోల్ అవ్వడంతో పాటు జుట్టు చివర్లు ఎక్కువగా పొడిబారకుండా చూసుకోవచ్చు.
వైద్యుల సలహా ముఖ్యం : సోరియాసిస్, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు డెర్మటాలజిస్ట్‌లను సంప్రదించడం మంచిది. అలాగే వారు సూచించిన ప్రత్యేక షాంపూలతో తలస్నానం చేయడం బెటర్. ఎందుకంటే వారు సూచించిన ప్రొడక్ట్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. కొన్ని రకాల స్కాల్ప్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడతాయి.
జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా..? అయితే ఈ పొరపాట్లు చేయకండి