ముఖంపై మచ్చలు రావడం సహజం. అయితే, ఇవి కొన్నిసార్లు జన్యుపరంగా ఉంటే మరికొన్నిసార్లు సున్నితమైన చర్మంపై పుట్టుకొస్తాయి. ముఖంపై అతి సున్నితమైన కణాలు వెలుతురులోని కనిపించని రేడియేషన్ వల్ల కందిపోతాయి. వెలుతురంటే సూర్యకిరణాలే కాదండోయ్. మనం ఇంట్లో వాడే ట్యూబ్ లైట్, వంట చేసేటప్పుడు గ్యాస్ పొయ్యి మంట, మైక్రోవేవ్, మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్... ఇలా దేని ద్వారానైనా చర్మంపై మచ్చలు ఏర్పడవచ్చు.
మరి సూర్యకాంతి ప్రభావం, హార్మోన్ల అసమతుల్యత, చర్మ రకాలను బట్టి.. ఈ మచ్చలను తొలగించుకునేందుకు వివిధ పద్ధతులున్నాయంటున్నారు ప్రముఖ చర్మ నిపుణులు డాక్టర్ సుశాంత్ శెట్టి.
1. ముఖాన్ని కప్పేయండి..
కొంతమంది పుట్టుకతోనే సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. దానిని ఎవరూ మార్చలేరు. అలాంటివారు, తరచూ 35-40 ఎస్పీఎఫ్ల సన్ స్క్రీన్లు ఉపయోగించవచ్చు. ఇక బయటికి వెళ్లేటప్పుడు స్కార్ఫ్‌తో ముఖాన్ని కప్పిఉంచండి. ఇలా చేయడం వల్ల వెలుతురు, రేడియేషన్ నుంచి కాపాడుతుంది. అయితే, ఇప్పటికే ఉన్న మచ్చలు తగ్గించకపోవచ్చు కానీ, కొత్త మచ్చలు ఏర్పడకుండా చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
2. ఔషధాలను తీసుకోండి...
వైద్యుల సూచనల ప్రకారం ఔషధ గుణాలున్న క్రీములు ముఖంపై రాయడం వల్ల చర్మం ఉత్తేజితమవుతుంది. అయితే, ఈ క్రీములను మచ్చలు ఉన్నచోట మాత్రమే పూసుకోవాలి. అలా కాదని ముఖమంతా పూస్తే.. సమస్య మరింత పెరిగే అవకాశముంది.
3. ఎలక్ట్రిక్ బర్నింగ్
బాహ్యచర్మంపై ఏర్పడిన ఈ మచ్చలను పోగొట్టుకోడానికి ఎలక్ట్రిక్ బర్నింగ్ మరో చక్కటి పరిష్కారం. ఈ చికిత్సలో విద్యుత్తును వినియోగించి బాహ్య చర్మ పొరను కాల్చేస్తారు. ఆ ప్రాంతంలో కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి. దీంతో 60 శాతం మచ్చలు తిరిగి రావు. ఈ చికిత్స తర్వాతా జాగ్రత్తలు పాటిస్తే మచ్చలు పూర్తిగా తగ్గిపోయే అవకాశముంది.
4. రసాయనంతో చెక్
ట్రైక్లోరోఅసెటిక్ అనే ఆమ్లంతో చర్మంపై మచ్చలను తొలగించవచ్చు. ఈ పద్ధతిలో 30-50 శాతం మచ్చలు తిరిగి రాకుండా ఉండే అవకాశముంది.
5.లేజర్ చికిత్స
చర్మ సమస్యలకు ఇటీవల కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్న పద్ధతి లేజర్ ట్రీట్మెంట్. అలాగే ఈ సన్నటి మచ్చల సమస్య నుంచి దాదాపు 50 శాతం వరకు విముక్తి పొందేందుకు లేజర్ చికిత్స చేయించుకోవచ్చు.
6. సహజ పద్ధతులు..
- బొప్పాయి, నిమ్మకాయ, టమాట వంటి సహజ చర్మహిత వనరులతో.. మచ్చలపై మర్ధనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- అయితే, పండ్లు కూరగాయల్లోని కొన్ని ఆమ్లాలు కొందరిలో ప్రతికూల ప్రభావమూ చూపించే అవకాశముంది. అందుకే, ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలన్నా ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
ఇదీ చదవండి: మల్లెచాయ్ మనసారా తాగేయాలోయ్!