ఆన్‌లైన్ తరగతుల పేరిట పిల్లలు స్మార్ట్‌ఫోన్లతో ఎక్కువ గడపడం వల్ల హ్రస్వ దృష్టి ముప్పు పొంచి ఉందని నేత్ర వైద్య నిపుణులు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు తెలిపారు. రానున్న 30 ఏళ్లలో ఈ సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదముందన్నారు. ఆసుపత్రికి ఇటీవల గ్రీన్‌బర్గ్ పురస్కారం దక్కిన సందర్భంగా పలు అంశాలపై బుధవారం మాట్లాడారు.
‘‘ఎక్కువ సమయం ఫోన్లకే పరిమితం కావడం, ఆటలకు దూరమవడం దూరదృష్టి లోపానికి కారణమవుతోంది. ఇది 2050 నాటికి తీవ్రం కానుంది’’ అని తెలిపారు. ప్రపంచాన్ని ఎక్కువగా వేధిస్తోన్న గ్లకోమా కూడా విస్తరిస్తోందని.. దాన్ని నియంత్రించే విధానాలపై తమ సంస్థల్లో పరిశోధన కొనసాగుతోందన్నారు. 40 ఏళ్ల పైబడిన వారు కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అంధత్వ సమస్యల నుంచి బయటపడే అవకాశముందన్నారు. సరైన చికిత్సతో 90శాతం కంటిచూపు తిరిగొస్తుందని.. ఆ స్థాయి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరముందన్నారు. పుట్టుకతోనే అంధత్వం, కంటి క్యాన్సర్లకు చికిత్సతో పాటు, వాటిపై విస్తృత పరిశోధనలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
- ఇదీ చూడండి : చిన్ని నయనాలను కాపాడుకుందామిలా..!