కాఫీ గుండెకు మంచిదేననీ మోతాదు మించితేనే హానికరమనీ రకరకాల పరిశోధనలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశీలనలో రోజుకి రెండుమూడు కప్పుల కాఫీ తాగిన మహిళల్లో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉంటుందని తేలింది.
ఇందుకోసం వీళ్లు 20-44 సంవత్సరాల మధ్య మహిళల్ని ఎంపిక చేసుకుని కాఫీ తాగని వాళ్లతో పోలిస్తే రోజుకి రెండుమూడు కప్పుల కాఫీ తాగిన వాళ్లలో కొవ్వు కణజాలం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే 45- 70 సంవత్సరాల మధ్య వయసు వాళ్లలో కూడా కాఫీ తాగే వాళ్లలో కొవ్వు తక్కువగా ఉందట.
మగవాళ్లలో కూడా కాఫీ తాగనివాళ్లలోకన్నా తాగేవాళ్లలో కొవ్వు కణజాలం కొంత తక్కువే ఉందట. కానీ స్త్రీలలో అయితే ఈ కొవ్వు కణజాలం శాతం మరీ తక్కువగా ఉంది. ఈ పరిశీలన ఆధారంగా కాఫీలోని బయోయాక్టివ్ పదార్థాలు శరీర బరువుని కొంతవరకూ నియంత్రిస్తాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు.
ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...