నొప్పితో కూడిన నెలసరి... పీరియడ్స్‌లో నొప్పి గురించి గైనకాలజిస్ట్‌తో తప్పక మాట్లాడాలి. ఛాతీలో అసౌకర్యం, తిమ్మిర్లు, వికారం... ఇలా రకరకాల ఇబ్బందుల్లో దేన్నో ఒకదాన్ని ఆ సమయంలో ప్రతి మహిళా అనుభవిస్తూనే ఉంటుంది. కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం జరిగితే వెంటనే అప్రమత్తం కావాలి. కడుపులో కణతులు, ఎండోమెట్రియాసిస్ లాంటి అనారోగ్యాలకు ఇవి సంకేతం కావొచ్చు. అందుకే తక్షణమే వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి కారణాల్ని కనుక్కుంటారు.
క్రమం తప్పితే... నెలసరి నొప్పి ఎంత పెద్ద సమస్యో... క్రమరహితంగా రావడం కూడా అలాంటిదే. ఆహారం సరిగా తీసుకోకపోవడం, హార్మోన్ సమస్యలు, ఆహారంలో మార్పులు... గర్భనిరోధక మాత్రలు, ఇతర వ్యాధులు... ఇవన్నీ నెలసరి క్రమం తప్పడానికి కారణాలే. ఒక్కోసారి ఎలాంటి కారణమూ ఉండక పోవచ్చు. అయితే తరచూ ఇలా జరుగుతుంటే మాత్రం తప్పక స్త్రీవ్యాధి నిపుణులను కలవాల్సిందే.
వెజైనాకు సంబంధించి... కొందరిలో వెజైనా నుంచి దుర్వాసన వస్తుంది. కానీ డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఇది మంచి పద్ధతి కాదు. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్లా ఇలా జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతంలో దురద, మంటా, నొప్పిగా ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే కొన్ని ప్రమాదకర జబ్బులకు ఇది సంకేతం. కాబట్టి తప్పక వైద్యులను కలసి సమస్య చెప్పాలి. యోని నుంచి తెలుపు (స్రావం) కావడం సహజం. ఇది మోతాదుకు మించి వస్తున్నా, రంగు, స్థితి మారినా వెంటనే వెద్యులను కలవాలి.
- ఇదీ చదవండి : Teen Pregnancy: ఈ విషయాలు మీకు తెలుసా?