అల్లం క్యారెట్ సూప్
కావల్సినవి:
క్యారెట్లు- పెద్దవి రెండు, ఉల్లిపాయ-ఒకటి, అల్లం తురుము- 2 టీ స్పూన్లు, ఆలివ్ నూనె- చెంచా, నీళ్లు- రెండు కప్పులు, మిరియాల పొడి- తగినంత.
తయారీ:
ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయను కూడా సన్నగా తరగాలి. తర్వాత పాన్ పొయ్యి మీద పెట్టి అందులో చెంచా ఆలివ్‌నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించు కోవాలి. అవి వేగాక అల్లం తరుగు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి కలియతిప్పి మూత పెట్టాలి. ఓ నిమిషం తర్వాత కప్పు నీళ్లు పోసి స్టౌ సిమ్‌లో పెట్టి మూత పెట్టాలి. కొన్ని నిమిషాలకి క్యారెట్ ఉడికాక పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక ఓ అరకప్పు నీళ్లు కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేయాలి. ఆ తర్వాత మరో అరకప్పు నీళ్లు కలిపి పాన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి మిరియాల పొడి చల్లాలి. కాసేపు స్టౌవ్ మీద ఉంచి కలియతిప్పి కట్టేస్తే సరి.
గుమ్మడి కాయ సూప్
కావల్సినవి:
గుమ్మడి కాయ- చిన్నది, ఉల్లిపాయ- ఒకటి, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, నీళ్లు- రెండు కప్పులు, వెన్న - రెండు చెంచాలు, ఎండబెట్టిన తులసి ఆకులు- కొన్ని, మిరియాల పొడి- కొద్దిగా, ఉప్పు- రుచికి తగినంత, పంచదార- అరచెంచా,
తయారీ:
గుమ్మడికాయ చెక్కు తీసి సన్నగా ముక్కలు తరగాలి. ఉల్లిపాయనీ తరిగి అందులో పొట్టు తీసిన వెల్లుల్లి, గుమ్మడి కాయ ముక్కలు, కప్పు నీళ్లు పోసి కుక్కర్‌లో ఓ పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి. కాసేపటికి ఆ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత ఓ పాన్‌లో వెన్న వేసి పొయ్యి మీద పెట్టాలి. వెన్న కరిగాక గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసి అందులో మరో కప్పు నీళ్లు తులసి ఆకులు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, పంచదార వేసి బాగా కలియతిప్పాలి. సూప్ చిక్కబడ్డాక పొయ్యి కట్టేయాలి. వేడివేడిగా సిద్ధమైన గుమ్మడి సూప్‌పైన తురిమిన చీజ్‌తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.
ఇదీ చదవండి: ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తెలుసా..?
ఇదీ చదవండి: దవా ఛాయ్.. తాగితే రోగనిరోధక శక్తి పెరుగునోయి..
పాలకూర సూప్
కావల్సినవి:
పాలకూర - రెండు కట్టలు, వెన్న- చెంచా, బిర్యానీ ఆకు- రెండు, వెల్లులి తరుగు- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు-రుచికి తగినంత, సెనగపిండి- చిటికెడు, నీళ్లు- రెండు కప్పులు, జీలకర్ర పొడి- చిటికెడు, మిరియాల పొడి- రెండు టీస్పూన్లు.
తయారీ:
ముందుగా పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత పాన్‌లో వెన్న వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. వెన్న కరిగాక బిర్యానీ ఆకు, వెల్లుల్లి తరుగు వేయాలి. అవి కాస్త వేగాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు, మిరియాల పొడి చేర్చి మూత పెట్టాలి. కూర మగ్గిపోయాక సెనగపిండి వేసి కలియ తిప్పి రెండు కప్పుల నీళ్లు పోయాలి. కొద్దిసేపయ్యాక జీలకర్ర పొడి చేర్చాలి. రెండు నిమిషాలకి అందులోని బిర్యానీ ఆకును తీసేసి పొయ్యి కట్టేయాలి. ఆ మిశ్రమం చల్లబడ్డాక మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. అందులో మరో టీస్పూను మిరియాల పొడి, పావు కప్పు నీళ్లు కలిపి పాన్‌లో పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకూ ఉంచి మంట కట్టేయాలి. ఈ సూప్‌లో కాస్త నిమ్మ రసం కలిపితే చాలా రుచిగా ఉంటుంది.
ఇదీ చదవండి: శ్వాస సమస్యలా?.. ఈ ఆసనం ట్రై చేయండి!