Brain Stroke Symptoms : మన శరీరంలో చలనానికి కారణం మెదడు. రక్త నాళాల ద్వారా మెదడుకు రక్త ప్రసరణ జరిగితేనే అది మన అవయవాలను పని చేసేలా చేస్తుంది. పొరపాటున మెదడుకు రక్త ప్రసరణ జరగకపోయినా, మెదడుకు రక్తం తీసుకెళ్లే రక్త నాళం చిట్లినా.. రక్తం గడ్డకట్టినా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీనినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి 50 ఏళ్లు పైబడిన వారికి వస్తుంది. అయితే ఇప్పుడున్న కాలంలో ఆహార అలవాట్లలో మార్పుల వల్ల ఇది 45-50 ఏళ్ల లోపు వయసు గల వారిలోనూ వస్తోందని నిపుణలు చెబుతున్నారు. దీనినే 'స్ట్రోక్ ఇన్ యంగ్' అని కూడా అంటారు.
ఈ స్ట్రోక్ వచ్చిందంటే శరీరంలో ఓ వైపునున్న అవయవాలు పనిచేయకుండా ఆగిపోతాయి. దీన్నే పక్షవాతం అంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్తో పాటు శరీరం పలుచపడిపోయి ఆ ప్రాంతమంతా పుండ్లు ఏర్పడుతాయి. అంతే కాకుండా ఇది న్యూమోనియాకు దారి తీసే అవకాశాలు సైతం ఉన్నాయి. ప్రాథమిక చికిత్స వీలైనంత త్వరగా అందిస్తేనే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడవచ్చు. ఒక్కోసారి శాశ్వత పక్షవాతానికి దారి తీసే అవకాశం ఉంది. అంతే కాకుండా మెదడంతా రక్త ప్రసరణ జరిగి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
వ్యాధి లక్షణాలు..
- శరీరం బలహీనంగా మారుతుంది. శరీరంలో తిమ్మిర్లు వస్తాయి.
- ఒక కన్ను లేదా రెండు కళ్లు కనిపించకుండా పోతాయి.
- ఆహారాన్ని తినేటప్పుడు గొంతులో సమస్యలు తలెత్తుతాయి.
- తీవ్రమైన తలనొప్పి వస్తుంది.
- మాట్లాడడానికి అలాగే ఇతరులు చెప్పింది అర్థం చేసుకునేందుకు కష్టంగా మారుతుంది.
- ముఖం ఒక వైపు లాగుతున్నట్లు అనిపించినా పై లక్షణాల్లో ఏ ఒక్కటి శరీరంలో కనిపించినా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
మెడడులో బలహీనంగా ఉన్న రక్త కణాలు చిట్లితే వచ్చే స్ట్రోక్‌ను హెమోరేజ్ స్ట్రోక్ అంటారు. అలాగే మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోతే దాన్ని ఎస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇది సాధారణంగా అధిక రక్తపోటు ఉన్న వారికి వస్తుంది. కొన్ని సార్లు మెదడుకు తాత్కాలికంగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీన్నే మిని స్ట్రోక్ అంటారు.
స్ట్రోక్ ఎటువంటిదైనా సరైన సమయంలో చికిత్స అందించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే లక్షణాలను గుర్తించిన వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. ముఖంలో మార్పులు కనిపిస్తే ఆ వ్యక్తిని నవ్వమని అడగాలి. దాని బట్టి అతడికి పక్షవాతం వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆ వ్యక్తికి అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించి తదుపరి చికిత్స కోసం వైద్యులు స్కానింగ్ చేస్తారు. ఫాస్ట్ థెరపీని ఉపయోగించాలి. ఫేస్ ఆర్మ్ స్పీచ్ టైమ్.. అంటే ముఖం, చేయి లేదా మాటల్లో మార్పులు వస్తే సమయానికి స్పందించాలని దాని ఉద్దేశం.
సమస్యకు పరిష్కారాలు..
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే.. మొదటి మూడు గంటల్లోపు ఇంజెక్షన్స్ తీసుకుంటే ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఆలస్యం చేసే ప్రాణానికే ప్రమాదం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి లక్షణాలు ఉంటే వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా వాడుతుండాలి.
- యోగా, వ్యాయామం లాంటివి అలవరుచుకోవాలి. డ్యాన్స్, స్పోర్ట్స్ లాంటి శారీరక వ్యాయామానికి దోహద పడే పనులను చేస్తుండాలి.
- ఆహార నియమాలు పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- కొవ్వు పదార్థాలను తినడం తగ్గించుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం అలావాట్లను మానుకోవాలి.
- బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండే వారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి సలహాలు పాటించాలి.
- వంటలో ఉప్పు వీలైనంత తక్కువగా వేసుకుని తినాలి.
- పళ్లు, కూరగాయాలు ఎక్కువ మోతాదులో తినాలి.
- ఊబకాయం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. దీని కోసం అధిక కొవ్వుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి.
ఇదీ చదవండి:Calories Count మీరు తినే ఆహారంలో ఎన్ని కెలోరీలు ఉన్నాయో తెలుసుకోండి