Best Yoga Asanas for Gas Relief in Telugu : ఈ మధ్య కాలంలో గ్యాస్, ఎసిడిటీ అనే సమస్యలు సర్వ సాధారణమైపోయాయి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది. దీని వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటూ ఏం తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా గ్యాస్ సమస్య(Gas Problem) వచ్చినప్పుడు కడుపు అంతా ఉబ్బరంగా ఉండటంతో పాటు మెలిపెట్టేసినట్లు అనిపిస్తోంది. దీంతో చాలా మంది.. గ్యాస్ ట్రబుల్ నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు ఓ ట్యాబ్లెట్ వేసుకోవడమో లేదా ఏదైనా కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడమో చేస్తుంటారు. వీటిని తీసుకోవడం ద్వారా ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మీరు గ్యాస్ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. అసలు గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది..? ఈ సమస్య తగ్గడానికి ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
Causes for Gas Problems : సాధారణంగా ప్రతి ఒక్కరిలో అజీర్తి కారణంగా గ్యాస్ సమస్యలు ఉత్త్పన్నమవుతాయి. ముఖ్యంగా మసాలాతో కూడిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు, ఫైబర్ కంటెంట్ ఉన్నవి అధికంగా తిన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ వల్ల ఫుడ్ నెమ్మదిగా అరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పీరియడ్స్ సమయంలో కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ప్రాథమికంగా కడుపు, పేగులకు సంబంధించిన సమస్య. ఈ యోగాసనాలు వేయడం ద్వారా ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు..
పవన ముక్తాసనం : ఈ ఆసనం వెన్నెముక, కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. అదే విధంగా జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. కాబట్టి ఈ ఆసనం వేయడం ద్వారా గ్యాస్ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ ఆసానాన్ని ఎలా వేయాలంటే.. విశ్రాంత స్థితిలో వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను మడిచి, పొత్తికడుపు దగ్గరకు తీసుకురావాలి. చేతులతో కాళ్లను పట్టుకుని తోడలు, పొత్తికడుపునకు ఒత్తిడి కలిగిస్తూ మోకాళ్లు ముఖం దాకా వచ్చేలా చేయాలి. తలను పైకెత్తి, గడ్డం ఛాతికి ఆనించాలి. ఇలా 60 నుంచి 90 సెకన్లు ఈ భంగిమలో ఉండి, తిరిగి యథాస్థితిలోకి రావాలి.
మత్స్యాసనం : వెన్నెముక, ఛాతి కండరాలను బలంగా మార్చడంలో ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. పొత్తి కడుపును మసాజ్ చేసి కడుపులోని గ్యాస్‌ను ఈజీగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఎలా చేయాలంటే.. ముందుగా పద్మాసనం వెయ్యాలి. పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి రెండు చేతులతో కాలి బొటనవేళ్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి. కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి. తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేవాలి.. పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి.
ఉత్తనాసనం : ఇది పొత్తి కడుపు కండరాలను స్టిమ్యూలేట్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే దూరమవుతాయి. ఎలా వేయాలంటే.. రెండు కాళ్లని దూరంగా పెట్టి నిలబడండి. మీ రెండు చేతులని పైకి ఎత్తండి. మీరు కిందకి వంగి కాళ్లని వంచకుండా పాదాలను తాకినప్పుడు డీప్ బ్రీథ్ తీసుకుని వదలండి. ఈ పొజిషన్‌లో 20 సెకన్ల పాటు ఉంచి సాధారణ స్థితికి తిరిగి రావాలి.
బాలాసనం : ఈ ఆసనాన్ని 'చైల్డ్ పోజ్' అని అంటారు. దీనిని వేయడం ద్వారా ఛాతి, వెన్నెముక, భుజాలు, ఉదర కండరాలు స్ట్రెచ్ అవుతాయి. తద్వారా పేగుల్లో పేరుకుపోయిన గ్యాస్ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందుతారు. ఎలా చేయాలంటే.. ముందుగా ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద మోకాళ్లపై కూర్చోవాలి. తరువాత పాదాలపై పిరుదులు ఆనించి కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. తరువాత నుదురు భాగం మ్యాట్‌కు తగిలేలా ముందుకు వంగాలి. తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. అలా ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి. ఈ భంగిమను కనీసం 30 సెకన్ల పాటు వేసినా చాలు.
పశ్చిమోత్తానాసనం : ఈ ఆసనం పొత్తి కడుపు కండరాలను మసాజ్ చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు చాలా ఈజీగా నివారించుకోవచ్చు. ఎలా వేయాలంటే.. ముందుగా రిలాక్స్ గా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ల వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు.. అయితే రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది.
సేతుబంధాసనం : దీనిని 'బ్రిడ్జ్ పోజ్' అంటారు. ఇది పొత్తి కడుపు కండరాలను స్ట్రెచ్ చేసి గ్యాస్ సులువుగా రిలీజ్ కావడంలో సహాయపడుతుంది. అలాగే గ్యాస్ సమస్యను నివారిస్తుంది. ఎలా వేయాలంటే.. నేలపై వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్‌డ్‌గా నేలను ఆన్చాలి. ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని.. వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉంచండి. చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండవచ్చు శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి. తరువాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!
Avoid These Habits After Meal : తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త పడాల్సిందే..!