కరోనా, రెండో రకం మధుమేహానికి సంబంధించిన జీవరసాయన చర్యల్లో సారూప్యతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మధుమేహం, ఊబకాయం ఉన్నవారు ఇన్‌ఫ్లూయంజా రుగ్మతల ప్రభావానికి గురవుతుంటారు. కొవిడ్ రోగుల్లో ఆరోగ్యం విషమించడానికి ఈ రెండు సమస్యలే ప్రధానంగా కారణమవుతున్నాయని కెనడాలోని మౌంట్ సైనాయ్ ఆసుపత్రి వైద్యులు వివరించారు.
కొవిడ్‌కు కారణమవుతున్న సార్స్-కోవ్-2 వైరస్ ఊపిరితిత్తులు, పేగుల్లోని కొన్ని కణాల్లో తిష్ట వేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తోంది. దీనివల్ల ఆ భాగాల్లో వాపు వస్తోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలు పలు ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ‘‘మానవ శరీరంలోకి ప్రవేశించడానికి, ఇన్‌ఫ్లమేషన్ కలిగించడానికి ఊపిరితిత్తులు, పేగుల్లోని కణాలను కరోనా వైరస్ ఉపయోగించుకుంటోంది. ఈ కణాలు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ2), డైపెప్టైడల్ పెప్టిడేస్-4 (డీపీపీ4) అనే కీలక ప్రొటీన్లను వెలువరిస్తాయి. టైప్-2 మధుమేహం వృద్ధి చెందే సమయంలోనూ ఇవి కనిపిస్తాయి’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేనియల్ జె డ్రూకర్ చెప్పారు.
ఇదీ చదవండి: '24 గంటలూ అందుబాటులో సహాయక కేంద్రాలు'