లాక్డౌన్ వేళ ఖాళీ సమయంలో రకరకాల వంటకాలు నేర్చుకుని వండేస్తున్నారు చాలామంది. నచ్చినవి తింటే మంచిదే కానీ అలా మితిమీరి తినేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, మీకు నచ్చే వంటకాలకు బదులుగా.. మీరు మెచ్చే రుచులతోనే ఆరోగ్యకరమైన రెసిపీలను చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ డా. దివ్యా గుప్తా .
నచ్చే ఆహారాన్ని ఆరోగ్యంగా ఎలా మార్చుకోవాలంటే...
తెల్లన్నం బదులు గోబీ రైస్..
సాధారణ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మరి అన్నం తినకుండా ఉండగలమా? అందుకే, ఆ బియ్యంలో గోబీ పువ్వు వేసుకుని.. కాలిఫ్లవర్ రైస్ చేసుకుంటే.. శరీరానికి అత్యధికంగా విటమిన్ సీ అందుతుంది. కార్బోహైడ్రేట్లను మీ శరీరంలోకి చేరనీయదు. గోబీ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి.
చిప్స్ స్థానంలో పాప్‌కార్న్...
నూనెలో వేయించిన ఏ చిప్స్లోనైనా కొవ్వు అధికంగా ఉంటుంది. కానీ, మొక్కజొన్న పేలాలు చాలా హెల్తీ. ఇవి చిప్స్ తినాలనే కోరికనూ తీర్చేస్తుంది. అయితే, నూనెలో దట్టంగా వేయిస్తే పాప్కార్న్లోనూ ఫ్యాట్ శాతం పెరిగిపోతుంది. అందుకే, కాస్త ఆలివ్ నూనె, వెల్లుల్లి ఉప్పు వేసుకుని తింటే అదిరిపోతుంది.
పాత పద్ధతినే కొత్తగా..
మన పూర్వీకులు ఏరికోరి ఆరోగ్యకరమైన చిరు ధాన్యాలను తిన్నారు. రాగి, కొర్రలు, సజ్జలు, వరిగులు, జొన్నలు, సామలు, అరికలు, ఊదలు వంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాత రుచులు నచ్చనివారు వీటితో కిచిడీ, పోహా, ఇడ్లీ, దోసలు వేసుకుని తినొచ్చు. ఈ ధాన్యాల్లో కావలసినన్ని ప్రోటీన్లు, విటమిన్ బీ, ఫైబర్, ఐరన్, కాల్షియం, పీచు పదార్ధం, పాస్పరస్, జింక్, పొటాషియం, కాపర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉంటాయి.
ఖిలా ఖిలా కినోవా!
కినోవా... బియ్యం వంటి ధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం. ఫైబర్ అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. వీటితో రొట్టెలు, కిచిడీ, సలాడ్, కినోవా టిక్కీ చేసుకుంటే బాగుంటుంది..
చిలకడదుంప చిప్స్ చేస్తే...
చిలకడదుంపలో విటమిన్ సీ, ఈ, బెలా కారొంటీన్ ఉంటాయి. ఆలు చిప్స్ చేసుకునే బదులు, వీటితో చిప్స్ చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
నూడుల్స్ తినాలనిపిస్తే...
ఎంత జంక్‌ఫుడ్ అయినా... నోరూరించే నూడుల్స్ వదులుకోవడం కష్టమే. అందుకే దోస జాతికి చెందిన జుచినీతో తయారు చేసే నూడుల్స్‌తో ఆ రుచిని ఆరోగ్యంగా ఆస్వాదించొచ్చు.
మిక్స్చర్ లాంటి చిరుతిళ్లు తినాలనిపిస్తే... పల్లీలు, మఖానా వంటివి వేయించుకుని తింటే జిహ్వ కాస్త సంతృప్తి పడుతుంది.
రసం కన్నా పండు మిన్న..
జ్యూసులు తాగడం మంచిదే. కానీ, మనం చక్కెర వేసి జ్యూస్‌లోని పోషకాలను పొగొడతాం. పైగా అందులోని ఫైబర్‌ను తీసేస్తున్నాం. కాబట్టి జ్యూస్ తాగాలనిపిస్తే.. ఓ పండు తీసుకుని తినేస్తే రుచి అదే ఉంటుంది కానీ, కాస్త ఎక్కువ ఆరోగ్యం మీ సొంతమవుతుంది!
బీట్రూట్ టిక్కీలు
ఆలూ టిక్కీలు శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వాటికి బదులు, బీట్రూట్ వంటి కూరగాయలతో టిక్కీలు చేసుకుంటే సరిపోతుంది. పైగా బీట్రూట్ ఊబకాయం, మధుమేహాన్ని, హృద్రోగాలను తగ్గిస్తుంది.
మాంచి మజ్జిగ డ్రింక్..
చక్కెర కలిపి చేసే పానీయాలకంటే.. మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. ఇందులోని బీ కాంప్లెక్స్, ప్రోటీన్, పొటాషియం జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహకరిస్తాయి. భోజనం తర్వాత కాసింత ఇంగువ, అల్లం, నల్ల ఉప్పు, జీలకర్ర వేసిన మజ్జిగ సేవిస్తే.. ఎంత తిన్నా ఇట్టే అరిగిపోతుందంటే నమ్మండి.
ఇదీ చదవండి:వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి